5 కేజీల LPG సిలిండర్లపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం! ఇక గ్యాస్ కష్టాలు తీరినట్టే?
ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరా ఒత్తిడిని తగ్గించడానికి కేంద్రం 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపును రెట్టింపు చేసింది. వలస కార్మికుల కోసం ప్రవేశపెట్టిన 'ఛోటు' సిలిండర్ల వల్ల చిరునామా రుజువు లేకుండానే గ్యాస్ పొందవచ్చు. ఈ నిర్ణయం వలస కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారికి తగినంత వంట ఇంధనం లభించేలా చేస్తుంది.

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ కేటాయింపును రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఛోటుగా పిలవబడే ఈ 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లు ప్రత్యేకంగా పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టబడ్డాయి. సాధారణ గ్యాస్ కనెక్షన్ కోసం చిరునామా రుజువు అవసరం కాగా, ఈ చిన్న సిలిండర్‌ను కేవలం గుర్తింపు పత్రంతోనే కొనుగోలు చేయవచ్చు. దీంతో బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ అదనపు కేటాయింపులు మార్చి 2-3 తేదీలలో నమోదైన సరఫరా డేటాను ఆధారంగా తీసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయబడతాయి. ఇప్పటికే ఉన్న 20 శాతం గరిష్ట పరిమితికి అదనంగా ఈ పెంపు వర్తిస్తుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో ఈ అదనపు 5 కేజీల సిలిండర్లను ప్రత్యేకంగా వలస కార్మికుల అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. సరఫరా వ్యవస్థను సజావుగా నిర్వహించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారం తీసుకోనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ద్వారా వలస కార్మికులు, బలహీన వర్గాలకు తగినంత వంట ఇంధనం అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ కొరత సమయంలో ధరల పెరుగుదలను నియంత్రించడం, అవసరమైన వారికి సులభంగా సిలిండర్లు అందించడంపై దృష్టి పెట్టింది. మొత్తం మీద ఈ నిర్ణయం వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించడంలో, అవసరమైన ఇంధనాన్ని సమయానికి అందించడంలో కీలకంగా మారనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
