
కొత్త ఆకాంక్షలు.. కోటి ఆశల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కొన్ని వర్గాలకు తీపి కబురు అందించగా.. మరికొన్ని వర్గాలకు చేదు వార్తను వినిపించింది. బడ్జెట్ మద్యం ప్రియులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. మద్యం సుంకాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్య పానీయాలపై 100 శాతం సుంకం విధించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. దీంతో అన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు పెరుగనున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మద్యం ప్రియులకు షాక్ తగిలినట్లయింది.
కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు కూడా మూసివేశారు. అప్పట్లో చాలా మంది మద్యం లేక ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడం.. మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు సంబరాలు చేసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యంపై పన్నులు పెంచాయి. దీంతో మద్యం ప్రియులకు భారంగా మారినప్పటికీ.. విక్రయాలు మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు.
రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఖజానాలలో ఆదాయ రేటు కూడా పెరిగింది. కేంద్ర బడ్జెట్‌లో అన్ని రకాల మద్య పానీయాలపై 100 శాతం సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే.. ఇది గత కొన్నేళ్లుగా జరగలేదని, దీంతో మద్యం బ్రాండ్ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. దాని ప్రభావాలు భారతదేశంపై కూడా చూపుతున్నాయి. ఈ పరిస్థితిలో, అన్ని రకాల మద్య పానీయాలపై కేంద్రం 100 శాతం సెస్‌ను పెంచడం ఆర్థిక నిపుణులు ప్రత్యేకించి ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. యాదృచ్ఛికంగా, ఈ సంవత్సరం బడ్జెట్ ధూమపానం చేసేవారితో పాటు సిగార్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అందించింది. సిగరెట్లపై కూడా 16 శాతం సుంకం పెంచారు. దీంతో సిగరెట్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.
అయితే మద్యం, సిగరెట్ల ధరలు పెరిగినప్పటికీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చారిత్రాత్మకంగా, మధ్యతరగతి ప్రజలకు ఓదార్పునిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు, ఎంఐఎస్‌లో పొదుపుపై సీలింగ్‌ను పెంచిన తీరు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..