LIC: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ పేద ప్రజల కోసం ఒక చిన్న పాలసీని తీసుకొచ్చింది. దాని పేరు భాగ్య లక్ష్మి ప్లాన్. ఇది మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్. తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్లాన్ తక్కువ హామీ మొత్తం ఉంటుంది. దీనికి GST వర్తించదు. అలాగే పాలసీ తీసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ ‘టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ప్రీమియం’ అంటే ప్లాన్ సమయంలో చెల్లించిన ప్రీమియంలో 110 శాతం మెచ్యూరిటీపై చెల్లిస్తారు. ఇది పరిమిత కాల ప్రీమియం ప్లాన్.
ఇందులో పాలసీ వ్యవధి కంటే తక్కువ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస వయోపరిమితి 19 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి 55 సంవత్సరాలు. ప్రీమియం ప్రీమియం చెల్లించాల్సిన సంవత్సరాల సంఖ్య కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 13 సంవత్సరాలు. ప్రీమియం చెల్లించే కాల వ్యవధి కంటే 2 సంవత్సరాలు ఎక్కువగా లైఫ్ కవరేజీ ఉంటుంది. ఈ పాలసీలో కనీస హామీ మొత్తం రూ.20,000, గరిష్ట హామీ మొత్తం రూ.50,000. ప్రీమియం చెల్లించడానికి మీరు వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక పద్దతులను ఎంచుకోవచ్చు.
డిపాజిటర్ మెచ్యూరిటీ సమయంలో గణనీయమైన మొత్తాన్ని పొందుతాడు. ప్రీమియం వ్యవధిలో చెల్లించిన డబ్బులో 110 శాతం మెచ్యూరిటీపై తిరిగి వస్తుంది. పాలసీ తీసుకున్న 1 సంవత్సరంలోపు డిపాజిటర్ ఆత్మహత్య చేసుకుంటే అతనికి కవరేజీ ప్రయోజనం ఉండదు. కానీ ఒక సంవత్సరం తర్వాత జరిగితే కవరేజీ ప్రయోజనం అందిస్తారు. ఎల్‌ఐసి భాగ్యలక్ష్మి పాలసీ కింద డిపాజిటర్‌కు రుణం తీసుకునే సౌకర్యం లేదు. పాలసీని సరెండర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. డిపాజిటర్ పాలసీని సరెండర్ చేసినట్లయితే అతనికి డిపాజిట్ చేసిన డబ్బులో 30-90% చెల్లిస్తారు. పాలసీ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే దాని సరెండర్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది.