
గూగుల్ సంస్థ తన యూట్యూబ్ యూజర్ల కోసం ప్రీమియం లైట్ ప్లాన్ ను తిరిగి తీసుకువస్తోంది. యూట్యూబ్ మ్యూజిక్ తో సహా ఇతర సేవలు అవసరం లేని వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు ఎటువంటి ప్రకటనలు లేకుండా పాస్ట్ కాస్టులు, బోధనా కంటెంట్ తో పాటు అనేక వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో మ్యూజిక్ వీడియోలకు అవకాశం ఉండదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, థాయిలాండ్ దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్ ను ప్రారంభిస్తారు. కొంత కాలంగా ప్రకటన రహిత సభ్యత్వాలను యూట్యూబ్ గమనిస్తోందని, దాానికి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ప్లాన్ తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 13.99 డాలర్ల యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ అమలవుతుంది. దానికి ప్రత్యామ్నాయం కోరుకునే వారికి, మ్యూజిక్ కంటెంట్ ను చూడని వారిని కొత్త ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
యూట్యూబ్ గతంలోనూ తక్కువ ప్రీమియం ప్లాన్ ను అమలు చేసింది. 2021లో బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ లతో పాటు ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలలో ప్రీమియం లైట్ ప్లాన్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోదారులకు ప్రకటనలు లేకుండా కంటెంట్ ను చూసే అవకాశం కలిగింది. అయితే ఆఫ్ లైన్ డౌన్ లోడ్ లు, ప్లే బ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి వాటికి అవకాశం లేకుండా పోయింది. దాదాపు రెండేళ్ల తర్వాత 2023 అక్టోబర్ లో ప్రీమియం లైట్ ప్లాన్ ను యూట్యూబ్ నిలిపివేసింది. భాగస్వాములు, వినియోగదారుల అభిప్రాయం మేరకు ఆ ప్లాన్ విధానాన్ని మరింత మెరుగుపర్చాలని నిర్ణయం తీసుకుంది. సబ్ స్క్రైబర్ల లైట్ ప్లాన్ ను రద్దు చేసే మందు వారికి నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా అందజేసింది.
యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్ ను మళ్లీ తీసుకువస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని విధానాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మన దేశానికి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో నెలకు రూ.149, మూడు నెలలకు రూ.459, ఏడాదికి రూ.1490 కు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అందజేస్తోంది. అలాగే ఐదుగురు అదనపు సభ్యులకు నెలకు రూ.299, అర్హత కలిగిన విద్యార్థులకు నెలకు రూ.89కి ప్లాన్లను అమలు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి