
బంగారం ధరలు ఏరోజుకారోజు మారడం మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా బంగారం ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడం కూడా మనం చూస్తునే ఉన్నాం. అయితే అసలు దీనికి గల కారణాలేంటి? రోజులో ఏ సమయానికి బంగారం ధరలు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధరను నిర్ణయించే వ్యవస్థను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను వెల్లడిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి ప్రపంచమంతా బంగారం ధరలు అమలు అవుతుంటాయి. దేశాలు తమ టైమ్ జోన్ ప్రకారం ధరలను నిర్ణయించుకుంటాయి. భారత్ లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇండియన్ కరెన్సీలో ఈ ధరలను విడుదల చేస్తుంది. అయితే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది సొంతంగా ధరలను నిర్ణయించదు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్-రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ ఫీజులు, డిమాండ్ అండ్ సప్లై వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ ధరని నిర్ణయిస్తుంది. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలుంటాయి. దాన్ని బట్టే ధరలను లెక్క కడుతుంది.
బంగార ధర ప్రతి చోటా ఒకేలా ఉండదు. దేశంలోని ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటుంది. స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్ల రూల్స్ ప్రకారం అలాగే స్టేట్ ట్యాక్స్‌లకు అనుగుణంగా బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఈ మార్పు మరీ ఎక్కువగా ఉండదు. నగరాన్ని బట్టి కొద్ది స్థాయిలో మాత్రమే ధరల్లో మార్పులు కనిపిస్తాయి. వీటిని స్పాట్ రేట్స్ అంటారు. స్పాట్ రేట్స్ ను లోకల్ బులియన్ అసోసియేషన్స్ నిర్ణయిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి