AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: ఐపీఓకు జియో.. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు రెడీ అయింది. ఆ కంపెనీ సమర్పించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. దీంతో ఇది ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. భారతదేశపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లలో ఇది ఒకటిగా నిలవనుందని చెప్పవచ్చు.

Jio: ఐపీఓకు జియో.. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
Jio
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Aug 28, 2026 | 6:14 PM

Share

దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ నెట్‌వర్క్ జియో ప్లాట్‌ఫామ్ ఐపీఓకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సెబీ నుంచి తుది అనుమతులు తాజాగా మంజూరయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సమర్పించిన ముసాయిదా పత్రాలకు సెబీ పచ్చజెండా ఊపడంతో ఐపీఓకు లైన్ క్లియర్ అయినట్లయింది. ఈ ఐపీఓ ద్వావరా రూ.37,700 కోట్ల నిధుల సేకరించాలని రియలన్స్ ఇండస్ట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత స్టాక్ మార్కెట్లో చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్‌గా ఇది రికార్డు సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మొత్తం 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్ల విభజన ప్రక్రియలో ఇదొక కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ ఐపీఓ ద్వారా లభించే ఆదాయం నుంచి రూ.27,500 కోట్లను సంస్థకు ఉన్న పాత అప్పులను తీర్చేందుకు వినియోగించనున్నారు. మిగిలిన నిధులను వ్యాపార విస్తరణ, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు మళ్లించే యోచనలో రియలన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఆఫరింగ్‌లో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు 50 శాతం వరకు కేటాయించనున్నారు. ఇక సాధారణ చిన్నతరహా రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 35 శాతం షేర్లను దక్కేలా ప్రణాళిక రూపొందించారు. జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రధాన వాటాదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 66.43 శాతం భాగస్వామ్యంతో ఉంది. వీటితో పాటు ప్రపంచ సాంకేతిక దిగ్గజాలు మెటా 10 శాతం, గూగుల్ 8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (2.31%), KKR (2.31%), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ (2.31%), సిల్వర్ లేక్ (1.88%), ముబడాలా (1.85%), జనరల్ అట్లాంటిక్ సింగపూర్ (1.34%), అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (1.16%), TPG క్యాపిటల్ (0.93%) సంస్థలు కూడా పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52 కోట్లకు పైగా కస్టమర్లతో టెలికాం రంగంలో జియో అగ్రగామి సంస్థగా ఉంది.  ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లో మరిన్ని కొత్త రికార్డులను జియో సృష్టించనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ జూన్ 19న సెబీకి తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత సెబీ నుంచి తుది ఆమోదం లభించింది.

భారతదేశపు అతిపెద్ద వైర్‌లెస్ క్యారియర్‌ను కలిగి ఉన్న జియో ప్లాట్‌ఫామ్స్.. ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 డాలర్ల బిలియన్లను సమీకరించగలదని, 100 డాలర్ల బిలియన్లకు పైగా విలువను ఆశించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో తెలిపింది. కాగా జూన్ త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్ గతేడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో రూ.45,961 కోట్ల ఆదాయాన్ని నివేదించగా.. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.39,173 కోట్లకు పెరిగింది.

Follow Us