Electric Salt Spoon: ఇది స్పూనా..మంత్ర దండమా..? ఉప్పు వేయకుండానే ఆహారానికి భలే రుచి

|

Jan 08, 2025 | 4:45 PM

ఆహార పదార్థాల తయారీలో ఉప్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఎంత ఖరీదైన కూరలు వండినా సరే చిటికెడు ఉప్పు తగ్గితే అసలు తినలేం. కూర ఏమాత్రం చప్పగా ఉన్నా తినడానికి చాలా ఇబ్బంది పడతాం. మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఉప్పును ఎక్కువగా తినడం అనేక అనేక అనారోగ్యాలు కలుగుతాయి. అధిక రక్తపోటు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆహారంలో ఉప్పు తక్కువైతే నోటిలో పెట్టుకోలేం. ఈ సమస్య పరిష్కారానికి జపాన్ పరిశోధకులు ఓ మార్గం కనిపెట్టారు. కొత్త ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ (చెంచా)ను తయారు చేశారు. ఇది ఆహారాన్ని ఉప్పగా మార్చుతుంది.

Electric Salt Spoon: ఇది స్పూనా..మంత్ర దండమా..? ఉప్పు వేయకుండానే ఆహారానికి  భలే రుచి
Electric Salt Spoon
Follow us on

జపాన్ లోని కిరిన్ సీఈఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఉప్పు వేయకుండా వండిన ఆహారాన్ని దీనితో తింటే చప్పగా ఉండదు. ఉప్పు వేసినట్టే రుచిగా ఉంటుంది. తేలికపాటి ఎలక్ట్రికల్ స్టిమ్యూలేసన్ ద్వారా ఉప్పు రుచిని తీసుకువస్తుంది. ప్రస్తుతం జపాన్ లో ఈ స్పూన్ ను 127 డాలర్లకు విక్రయిస్తున్నారు. తమ దేశంలోని పెద్దవారి ఆరోగ్యం కోసం జపాన్ ఈ స్పూన్ ను తీసుకువచ్చింది. మీజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హూమి మియాషితా, ఇతర పరిశోధకులతో కలిసి దీన్ని తయారు చేశారు. ఆ దేశంలోని పెద్దవారు రోజుకు పది గ్రాముల సోడియం (ఉప్పు) తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన దానికంటే దాదాపు రెండింతలు ఎక్కువ. దీంతో ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు ఈ స్పూన్ తయారు చేశారు. దీన్ని ఉపయోగించడం వల్ల తినే ఆహారంలో లవణం ఒకటిన్నర రెట్లు పెరుగుతుంది.

ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ విషయం వింతగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ నిజమే. ఈ స్పూన్ లో నాలుగు ఇంటెన్సిటీ సెట్టింగులు ఉంటాయి. తినేవారి నాలుకపై సోడియం అయాన్ లను కేంద్రీకరించడానికి ఆహారం ద్వారా బలమైన విద్యుత్ ప్రవాహాన్ని పంపుతుంది. ఆహారం తినేటప్పుడు ఈ స్పూన్ మన నాలుకను తాకుతుంది. ఈ క్రమంలో కరెంట్ ను పంపిస్తుంది. దీంతో మనకు ఉప్పు తిన్న భావన కలుగుతుంది.

ఎలక్ట్రిక్ స్పూన్ లో రెండు భాగాలు ఉంటాయి. దానిలో ఒకటి స్పూన్ బౌల్, రెండోది హ్యాండిల్. ఆ హ్యాండిల్ లోనే పవర్, మోను బటన్లు ఉంటాయి. దీనిలోని నాలుగు మోడ్ ల ద్వారా సాల్ట్ నెస్ స్టాయిలను తెలుసుకోవచ్చు. ఈ పరికరాన్ని సరైన విధంగా పట్టుకుంటేనే పనిచేస్తుంది. లేకపోతే ఆగిపోతుంది. తినేటప్పుడు హ్యాండిల్ మీద ఉన్న బ్లూ లైటు తెలుపు రంగులోకి మారుతుంది. సరైన దిశలో పట్టుకుంటునే అది కనిపిస్తుంది. ఆ దిశలో తింటేనే ఉప్పు రుచి కలుగుతుంది. అయితే ఈ స్పూన్ ద్వారా ఆహారంలో ఉప్పు రుచిని మాత్రమే పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇతర మసాలాలు, దినుసులను తప్పనిసరిగా వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి