Moonlighting: ఇన్ఫోసిస్‌ ‘గిగ్‌’ ప్రాజెక్ట్‌ వెనుక అసలు మర్మం అదేనా! మరి మూన్‌లైటింగ్‌కు ఓకే అన్నట్టా? లేనట్టా?

|

Oct 24, 2022 | 10:43 AM

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తాజాగా షరతుతో కూడిన అనుమతులు జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులకు అంతర్గత 'గిగ్‌' ఉద్యోగాలను చేపట్టేందుకు అనుమతించిన మొదటి ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం వార్తల్లో నడిచింది..

Moonlighting: ఇన్ఫోసిస్‌ గిగ్‌ ప్రాజెక్ట్‌ వెనుక అసలు మర్మం అదేనా! మరి మూన్‌లైటింగ్‌కు ఓకే అన్నట్టా? లేనట్టా?
Infosys to allow employees to take external gigs
Follow us on

మూన్‌లైటింగ్‌పై గత కొద్ది కాలంలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారనే నెపంతో ఐటీ దిగ్గజ సంస్థ విప్రో దాదాపు 300ల మంది ఉద్యోగులను తొలగించింది. ఐతే దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తాజాగా షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ‘గిగ్‌’ ఉద్యోగాలను చేపట్టేందుకు అనుమతించిన మొదటి ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం వార్తల్లో నడిచింది. కంపెనీ ఉద్యోగులు తమ పర్సనల్ టైంలో మాత్రమే ఈ విధమైన ఉద్యోగాలు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఐతే అందుకు సంబంధిత మేనేజర్‌, హెచ్‌ఆర్ నుంచి ముందుగా అనుమతి పొందవల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మూన్‌లైటింగ్‌ అంటే..

ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు. ఈ విధంగా ఒకటి కంటే ఎక్కవ ఉద్యోగాలు చేయడాన్ని ‘సైడ్ గిగ్’ లేదా ‘సైడ్ హస్టిల్’ అని కూడా అంటారు.

మూన్‌లైటింగ్‌పైఎందుకింత వ్యతిరేకత ?

కరోనా ఉధృతి కారణంగా దేశంలోని పలు ఐటీ కంపెనీలు వర్క ఫ్రం హోం షురూ చేశాయి. ఐతే ఈ విధానం వల్ల ఉద్యోగులు ‘మూన్‌లైటింగ్’కు పాల్పడుతున్నారని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ఉత్పాదకత, సేఫ్టీ, క్లయింట్ డేటా గోప్యత, కంపెనీ రీసోర్సెస్‌ (వనరుల)లను ఉద్యోగులు తమ సెకండ్‌ జాబ్‌కు వినియోగిస్తున్నారనే అభిప్రాయం ఆయా ఐటీ కంపెనీలకు ఏర్పడింది. దీంతో పలు ఐటీ సంస్థలు వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలికి.. ఎంప్లయిస్‌ను ఆఫీసులకు రప్పించేపనిలో పడ్డాయి. ఐతే ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించిన ‘గిగ్’ ప్రాజెక్ట్‌ గురించి క్షుణ్ణంగా నిర్వచించలేదు. అంతేకాకుండా ‘మూన్‌లైటింగ్’ అనే పదాన్ని కూడా ఎక్కడా ఉపయోగించలేదు. దీంతో ‘సైడ్ గిగ్‌’ని అనుమతించిన మొదటి ఐటీ కంపెనీగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

భారతీయ ఐటీ కంపెనీల యాజమన్యం నుంచి మూన్‌లైటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన విప్రో సీఈఓ రిషద్ ప్రేమ్‌జీ ఈ పద్ధతిని మోసం, అనైతిక చర్యగా అభివర్ణించారు. అంతేకాదు తన కంపెనీలో మూన్‌లైటింగ్‌కు పాల్పడిన 300కి పైగా ఉద్యోగులపై వేటు వేసింది కూడా. మూన్‌లైటింగ్‌కు అనుమతి ఇస్తే ఐటీ ఇండస్ట్రీ మొత్తం పతనమవుతుందని టీసీఎస్ సీఈవో ఎన్‌ గణపతి సుబ్రమణ్యం హెచ్చిరించారు. కేవలం డబ్బు సంపాదన కోసమే వేరొక ఉద్యోగం చేయరని, ఈ విధమైన ప్రాక్టీస్‌కు ఎవ్వరినీ అనుమతించబోమని ఆయన అన్నారు. తమ కంపెనీ ఉద్యోగులు కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని, ‘నో టూ టైమింగ్స్‌- నో మూన్‌లైటింగ్‌’ అని ఆయన అన్నారు. ఐతే ఇప్పటి వరకు తమ కంపెనీ ఉద్యోగులపై టీసీఎస్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అసలు ట్విస్ట్ అదే..

ఐతే ఇటీవల కాలంలో ఐటీ కంపెనీల్లో రికార్డు స్థాయిలో అట్రిషన్‌ (ఉద్యోగుల వలస) పెరిగిపోతోంది. 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు అత్యధికంగా 28.4 శాతం ఉండగా, విప్రో 23 శాతం, టెక్ మహీంద్రా 22 శాతంగా ఉంది. ఇక 2022 మొదటి త్రైమాసికంలో అట్రిషన్‌ను సింగిల్ డిజిట్‌లో మెయింటెన్‌ చేసిన ఇన్ఫోసిస్‌, 2023 మొదటి త్రైమాసికం నాటికి అట్రిషన్‌ రేటు రెట్టింపు(19.7 శాతం) అవుతుందనే భయం పట్టుకున్నట్టుంది. అందుకే తన కంపెనీ ఉద్యోగులను నిలుపుకోవడానికి’గిగ్ సైట్’కు అనుమతించిందనే పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ ‘గిగ్’ ప్రాజెక్ట్‌కు ఓకే చేసినప్పటికీ.. త్వరలోనే ఈ పద్ధతికి స్వస్తి పలుకుతుందని పలు నివేదికలు తెల్పుతున్నాయి. భారత ఐటీ రంగంలో వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో 12-13 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8-9 శాతానికి తగ్గవచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం, మూన్‌లైటింగ్‌ ఐటీ రంగంలో పెను ప్రమాదాన్ని సృష్టించినప్పటికీ.. కాలక్రమేణా ఇవన్నీ తగ్గుముఖం పట్టి మామూలు పరిస్థితులు నెలకొంటాయని నివేదికలు చెబుతున్నాయి.