PAN Card: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులున్నాయా? అయితే తప్పదు భారీ మూల్యం.. వెంటనే ఈ పని చేయండి..
ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన నియమాలు, నిబంధనల ప్రకారం, వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉండటం నిషేధం. ప్రతి వ్యక్తి ఒక్క పాన్ నంబర్ మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తికి చట్ట ప్రకారం భారీగా జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటారు.
పాన్ కార్డ్.. అందరికీ పరిచయం ఉన్న పేరు. పర్మినెంట్ అకౌంట్ నంబర్(పీఏఎన్) అంటారు. దీనిని ఆదాయ పన్ను శాఖ వ్యక్తులకు, కంపెనీలకు, సంస్థలకు ఇచ్చే ఓ ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీనిని గుర్తింపు కార్డుగా కూడా వినియోగిస్తుంటారు. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నా, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులు చేయాలన్నా.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. మన దేశంలో ఏ ఆర్థిక లావాదేవీకైన పాన్ కార్డ్ ఉండి తీరాలి. ఈ పాన్ కార్డుపై ఆ కార్డు కలిగిన వ్యక్తి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, ఆ పాన్ కార్డు నంబరు ఉంటుంది. ఈ పాన్ నంబర్ ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకమైన సిరీస్ తో నంబర్ ఉంటుంది. ఇది ఏ ఇతర వ్యక్తులకు మ్యాచ్ అవ్వదు. ఒక్కరికీ ఒక్కటే పాన్ కార్డు ఉండాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులుంటే కలిగి ఉండొచ్చా? అలా ఉంటే ఏమవుతుంది? తెలుసుకుందాం రండి..
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులుంటే..
ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన నియమాలు, నిబంధనల ప్రకారం, వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉండటం నిషేధం. ప్రతి వ్యక్తి ఒక్క పాన్ నంబర్ మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి చట్టరీత్యా నేరస్తుడు అవుతాడు. ఇది ఆదాయ పన్ను చట్టం ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.అతనికి చట్టపరమైన చర్యలతో పాటు భారీగా పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రికార్డులలో గందరగోళాన్ని కూడా కలిగిస్తుంది, ఒక వ్యక్తి యొక్క పన్ను చెల్లింపులు, ఫైలింగ్‌లను ఖచ్చితంగా ట్రాక్ చేయడం అధికారులకు కష్టతరం అవుతుంది.
జరిమానా ఎంతంటే..
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉన్నట్లు తేలితే, ఐటీ శాఖ వారిపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272బీ కింద చర్యలను తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉన్న వ్యక్తిపై రూ.10,000 జరిమానా విధించవచ్చు. వ్యక్తులు తమ వద్ద ఒక పాన్ కార్డ్ మాత్రమే కలిగి ఉండాలి. ఒకవేళ మీకు తెలియకుండా లేదా అనుకోకుండా పొందిన ఏవైనా అదనపు పాన్ కార్డ్‌లు ఉంటే అటువంటి వ్యక్తులు వెంటనే వాటిని సరెండర్ చేయాల్సి ఉంటుంది.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి..
ఆదాయపు పన్ను చట్టం 1961లో ఆర్థిక చట్టం 2017 కొత్త సెక్షన్ 139ఏఏ ను జత చేసింది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి పాన్ కోసం దరఖాస్తు చేసుకుంటుంటే.. వారు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. 2017 జూలై 1 నుండి ఇది అమలు జరుగుతోంది. అప్పటికే తీసుకున్న వారు ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ దీనిని లింక్ చేయకపోతే వెంటనే చేయాల్సి ఉంటుంది. 2023 జూన్ 30 లోపు ఆధార్ లింక్ చేయకపోతే.. మీరు జూలై 1 నుంచి పాన్ కార్డును వినియోగించలేరు. అందుకే నిర్ణీత రుసుము చెల్లించి పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..