Gold: భారత్ బంగారు కొండే..! మన దగ్గర ఎన్ని కోట్ల కేజీల పుత్తడి ఉందో తెలుసా?

భారతీయుల దగ్గరున్న బంగారం.. దాదాపు 2 కోట్ల కేజీలు. ఇది చదివిన తరువాత అంత గోల్డా అని ఆశ్చర్యపోతాం. ఇంత పుత్తడి మన దగ్గరుంటే మనకేం తక్కువ అనుకుంటాం. మరి ప్రపంచంలో 11 శాతం స్వర్ణం మన దగ్గరే ఉంటే.. ఇలా కాలర్ ఎగరేయక ఏం చేస్తారు? ఒకప్పుడు బంగారాన్ని కుదవపెట్టి దేశ అవసరాలను తీర్చుకోవాల్సిన దుస్థితి నుంచి.. ఓ 803 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిజర్వ్ చేసుకునే స్థాయికి ఎదిగాం. ఇంతకీ ఈ ఘనత మన భవితకు భద్రమేనా? అసలు గోల్డ్ రిజర్వ్స్ లో ప్రపంచంలో మన స్థానం ఎంత? పండగలకు, శుభకార్యాలకు బంగారం కొనే అలవాటు.. మనకు చేసే మేలు ఎంత?

Gold: భారత్ బంగారు కొండే..! మన దగ్గర ఎన్ని కోట్ల కేజీల పుత్తడి ఉందో తెలుసా?
India Gold Reserves
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jun 11, 2024 | 12:08 PM

బంగారంపై భారతీయులకు ఉండేది పిచ్చి కాదు. బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా. పిల్లల చదువులకు అవసరం వచ్చినా, వ్యవసాయానికి సాయం కావాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇల్లు కొనాలన్నా.. ఇలా ప్రతి అవసరానికి తోడుగా ఉండే ఒక శ్రీరామరక్ష. పంట బాగా పండితే రైతు కొనుక్కునేది బంగారమే. అదే పంట పండించడానికి కుదవపెట్టేదీ ఆ మెడలోని బంగారమే. అందుకే, ఆలికి సింగారం-అదనుకు బంగారం అంటుంటారు మనోళ్లు. అలా దేశంలో ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్క చూస్తే.. హా.. అని నోరెళ్లబెడతారు. ఆ నెంబర్ ఎంతో తెలుసా? 2 కోట్ల కేజీల పైమాటే!

India Gold

ప్రపంచంలో ఉన్న బంగారంలో భారత్ దగ్గర ఉన్నది దాదాపు 11 శాతం

ఇప్పుడంటే ఉద్యోగ భద్రత కనిపిస్తోంది గానీ ఓ 20, 30 ఏళ్ల క్రితం వరకు ఆ భరోసా ఉండేది కాదు. ఎప్పుడు ఉద్యోగం పోయి జీవితాలు తారుమారు అవుతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో చేయి చాచాల్సిన అవసరం లేకుండా అండగా ఉండేది బంగారమే. కొన్ని గణాంకాల ప్రకారం 2021లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. ఎందుకో తెలుసా. కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పర్సనల్ లోన్‌ తీసుకోడానికి అవకాశం లేనివాళ్లంతా మెడలోని తాళిబొట్టును తాకట్టుపెట్టి ఆ రోజులను వెళ్లదీశారు. అందుకే, జీతం పెరిగి, కాస్త కుదురుకున్నాక మొదటి పెట్టుబడి బంగారంలోనే ఉండేది. ఆడపిల్లకు పెళ్లి చేస్తుంటే.. ఎంత బంగారం పెట్టారు అనే మాట అనుకోకుండానే వచ్చేస్తుంది. ఆడపిల్లతో పాటు బంగారం ఇస్తే బతుకు భద్రంగా ఉంటుందన్న భరోసానే కారణం. అందుకే, భారతీయులకు బంగారం అంటే అంత ఇష్టం. పుత్తడిని మహాలక్ష్మిగా కొలుస్తుంటారు. అందుకే ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం ఇండియాలోనే ఉంది. అది కూడా భారతీయుల ఇళ్లల్లో.

World Gold

ఎక్కువ బంగారం ఉన్న దేశాల్లో 9వ స్థానంలో భారత్

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏటా కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో మరెవరి దగ్గరా లేనంత బంగారం భారతీయ కుటుంబాల దగ్గర ఉంది. ఓ అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లల్లో 2 కోట్ల 30 లక్షల కిలోల బంగారం ఉంది. అంటే, సుమారు 25వేల టన్నులన్న మాట. ప్రస్తుతం బంగారం నిల్వల్లో టాప్‌లో ఉన్న దేశం అమెరికా. దాన్ని టచ్ చేయడం ఇప్పట్లో ఇండియాకు సాధ్యం కాదు. అమెరికా రిజర్వ్స్‌లో 8133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటే.. మన ఆర్‌బీఐ వద్ద 803 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ బంగారం ఉన్న దేశాల్లో ఇండియాది 9వ స్థానం. కాని, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అమెరికా కంటే ఎక్కువ బంగారం మన దగ్గర ఉంది. ఒక్క అమెరికా ఏంటి.. జర్మనీ, స్విట్జర్లాండ్, ఐఎంఎఫ్ దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని కలిపినా మనదగ్గర ఉన్న దాంతో పోల్చితే తక్కువే.

Gold 9th

దేశంలోని ఆలయాల్లో 2500 టన్నుల బంగారం!

బంగారం ఒక నడిచే ఆస్తి. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కొంగు బంగారం అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది. పది గ్రాములైనా, వంద గ్రాములైనా చీర కొంగులో దాచుకుని తీసుకెళ్లిపోవచ్చు. పెద్ద స్పేస్ అక్కర్లేదు. అదే పది గ్రాములతో.. అప్పటికప్పుడు ఉండే తాత్కాలిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. అమ్మినా, కుదువ పెట్టినా వెంటనే డబ్బు చేతికి అందుతుంది. మరే వస్తువుకు లేనంత గిరాకీ కూడా ఉంటుంది. పైగా వందల సంవత్సరాలైనా పాడైపోదు. భద్రపరచడం కూడా సులువు. ఇక్కడ ఉద్దేశం దొంగల భయం ఉండదని కాదు. ఇక దీనిని ఫ్రిజ్‌లో పెడితేనే ఉంటుందనో… పాదరసంతో మిక్స్ చేస్తేనే నిలుస్తుందనో ఝంఝాటాలు లేవు. బీరువాలోనో, లాకర్లలోనో పెడితే ఏళ్లు గడిచినా అలా ఉండిపోతుందంతే. అంతేనా.. ధర అద్భుత:. పాతబడుతున్న కొద్దీ విలువ పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆ రోజుకు తగ్గ డబ్బు చేతిలో ఉన్నట్టే. ఇక భక్తితో దేవుడికి సమర్పించే బంగారానికి లెక్కే లేదు. రాజుల కాలంలో ఈ విధంగా ఇచ్చింది చాలా ఎక్కువ. అందుకే ఒక్క కేరళ ఆలయంలోనే 1300 టన్నుల బంగారం ఉంటుందని ఓ అంచనా. ఇక తిరుమల సహా దేశంలోని అన్ని ఆలయాల్లో ఉన్న బంగారాన్ని లెక్కిస్తే 2500 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2500 Gold

విదేశీయులు మనలాగా బంగారు ఆభరణాలు కొనరు. అమెరికాలాంటి దేశాల్లో ప్రభుత్వమే బంగారం కొని బిస్కెట్లుగా మార్చి ఖజానాలో పెట్టుకుంటుంది. ఎప్పుడైనా దేశానికి ఆర్థిక సమస్య వస్తే గట్టెక్కడానికి. అక్కడ అమెరికా ప్రభుత్వం చేసే పనిని ఇక్కడ భారతీయులు చేస్తుంటారు. కాసు లేదా తులం.. ఎంతొస్తే అంత బంగారం కొని పెట్టుకుంటారు. రేప్పొద్దున ఏదైనా కష్టం వస్తే గట్టెక్కవచ్చని. అందుకే, మనదేశానికి బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వక్కర్లేదు. భారతీయులు వాళ్లంతట వాళ్లే గట్టెక్కుతారు. జస్ట్ బికాజ్ ఆఫ్ గోల్డ్. మనవాళ్లకు బంగారంపై మోజు ఇప్పట్లో తగ్గేది కాదు. ఏటా దిగుమతి అవుతున్న బంగారమే ఇందుకు ఉదాహరణ. గోల్డ్ ఇంపోర్ట్స్‌లో ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 41.88 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే.. 2024లో అది 78.95 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అంటే బంగారం దిగుమతులు 88.5 శాతం పెరిగాయి. ఈ డిమాండ్ ఎప్పటికీ తగ్గనే తగ్గదు. ఎందుకంటే, పెళ్లిళ్లు, పండుగలు కామన్. అవి ఆగిపోవడం అనేదే ఉండదు. పెళ్లి అన్నాక బంగారం కొనాల్సిందే. పండగలు, ఆషాఢ-శ్రావణాల్లోనూ బంగారం కొంటూనే ఉంటారు. సో, భవిష్యత్తులోనూ భారతదేశంలోకి టన్నుల కొద్ది బంగారం వచ్చిపడుతూనే ఉంటుంది, అందులో చాలా భాగం నగలుగా మారి భారతీయుల ఇళ్లల్లోకి చేరుతూనే ఉంటుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. బంగారం ధర పెరుగుతున్నా సరే.. కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. భారతీయుల సగటు ఆదాయం పెరుగుతుండడంతో స్వర్ణం ధర పెరుగుతున్నా కొనడం ఆపడం లేదు. సో, బంగారంతో భారతీయుల అనుబంధాన్ని విడదీయడం దాదాపు అసాధ్యమే.

ఇతర దేశాల వాళ్లు బంగారాన్ని ఒక కమోడిటీగా చూస్తారు. అంటే వారి దృష్టిలో అది ఒక వస్తువు. రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటారు. కాని భారతీయులు అలా కాదు. మహాలక్ష్మిగా కొలుచుకుంటూ దాచుకుంటూనే ఉంటారు. ఎప్పుడైనా కష్టమొచ్చి అమ్ముకుంటే తప్ప.. బంగారంతో భారతదేశానికి విడదీయలేని బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ధన త్రయోదశి రోజున బంగారం కొనాలనే సంప్రదాయం తెచ్చిపెట్టుకున్నదే అయినా.. దాన్ని కూడా సంస్కృతిలో భాగంగా చేసుకున్నాం. పెళ్లి అంటే బంగారం లేకుండా ఉండదు. ఎంత పేదింటి ఇల్లాలు అయినా మెడలో రెండు కాసులైనా ఉండాలనుకోవడం కామన్. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆ బంగారమే బలం, ఇంటికి ఆర్థిక భద్రత కూడా. ఇందాక చెప్పుకున్నట్టు ఆలికి సింగారం.. అవసరానికి బంగారం అన్నమాట.

భారతదేశం, ఇంకా కొన్ని దేశాల్లో తప్ప బంగారాన్ని ఆభరణంగా చూడరు. అందుకే, ధగధగ మెరిసిపోయే నగలను భారతీయుల మెడలలో చూడగానే అమెరికన్స్ ఆశ్చర్యపోతుంటారు. వాళ్లకి మహాలక్ష్మి గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకవేళ వారికి తెలిసుంటే మాత్రం.. మన ఆడపడుచులు.. నడిచొస్తున్న మహాలక్ష్ముల్లాగే కనిపించేవారు. ఈ బంగారమే భారతీయులపై దాడులకు కూడా ఒక విధంగా కారణమవుతోంది. భారతీయుల ఇళ్లల్లోకి దొంగతనానికి వెళ్తే కచ్చితంగా బంగారం దొరుకుతుందన్న ఆశ కూడా పుట్టుకొచ్చింది.

భారతదేశం అంటే సిరిసంపదలకు నిలయం. ఇక్కడ సిరిసంపదలంటే బంగారం, వజ్రాలు, మాణిక్యాలు కాదు. బియ్యం, గోధుమలు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పత్తి.. ఇలా ఒకటేమిటి అన్నిటినీ సమృద్ధిగా పండించుకుంటున్న దేశం. విదేశాల్లో లేనివి మనదేశంలోనే ఉండేవి. అందుకే, వాళ్ల దగ్గరున్న బంగారాన్ని మనకు ఇచ్చి వాళ్లకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లే వాళ్లు. అలా పోగుబడిన బంగారానికి లెక్కే లేదు. అంత బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియక బంగారు నగలుగా ధరించడం మొదలుపెట్టారు. దేవుడి బంగారు విగ్రహాలను తయారుచేశారు. వాటికి కూడా బంగారం నగలతో అలంకరణ చేశారు. గడి గోడలను, గుడి శిఖరాలను బంగారంతో చేయించారు. చివరికి చీర జరీ అంచుల్లోనూ బంగారం పెట్టుకున్నారు. అంత బంగారం ఉండేది భారతదేశంలో. ఆ తరువాత బ్రిటిషర్లు, అంతకు ముందు విదేశాలు, మొఘలులు భారతదేశం నుంచి లెక్కలేనంత బంగారాన్ని కొల్లగొట్టారు. గజినీ మహ్మద్ లాంటి వాళ్లు సోమనాథ్ ఆలయంపై దండెత్తి కిలోలకు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అలా మనదేశం నుంచి ఎంత బంగారాన్ని దోచుకెళ్లినా.. ఇప్పటికీ మనమే టాప్‌లో ఉన్నామంటే.. ఏ స్థాయిలో మన దగ్గర బంగారం ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

20 ఏళ్లలో దాదాపు రూ.65,000 పెరిగిన 10 గ్రా. బంగారం ధర

2023లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62 వేల 400 రూపాయిలు ఉంది. కానీ ఏడాది తిరిగేసరికీ సుమారు 9 వేల రూపాయిలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలోనే రేటు బాగా పెరిగింది. ఒక్క 20 ఏళ్లు వెనక్కి వెళితే.. 2004 ఏప్రిల్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5 వేల 800 రూపాయిలు ఉండేది. కానీ ఇప్పుడు 70 వేలు దాటింది. అంటే జస్ట్ ట్వంటీ ఇయర్స్ లో పుత్తడి ధర 10 గ్రాములకు రూ.65,000 మేర పెరిగింది. అసలు ఎవరూ కలలో కూడా ఊహించని ధర ఇది. అందుకే మనదేశంలో చాలామందికి చేతిలో ఏ కాస్త డబ్బున్నా సరే.. ఎంతోకొంత బంగారాన్ని కొని పెట్టుకుంటారు. పండగల సమయంలో కొనే గోల్డ్ కు ఇది అదనంగానే ఉంటుంది. పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఇంకా ఇతర శుభకార్యాలు ఏవి జరిగినా సరే.. వాళ్లు కాస్త ఆత్మీయులు అయితే చాలు.. అయితే బంగారం లేదా వెండి వస్తువును ఇవ్వడం వారికి అలవాటు. అలా ప్రతీ కుటుంబం దగ్గర ఎంతో కొంత బంగారం ఉండడం కామన్.

Gold Hike

2022లో దేశంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసిన కుటుంబాలు 15 శాతం

బంగారాన్ని నగలుగా కొనడంతోపాటు… ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోనూ ఇప్పుడిప్పుడే బంగారాన్ని కొంటున్నారు భారతీయులు. ఆ మాటకొస్తే.. పొదుపు, పెట్టుబడి సాధనంగా బంగారమే కనిపిస్తోంది. భారతదేశంలో 6 లక్షల 50 వేల గ్రామాలు ఉంటే.. 36వేల గ్రామాల్లో మాత్రమే బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. వాళ్లంతా డబ్బును దాచుకోవడం కంటే.. బంగారంలోనే మదుపు చేస్తున్నారు. ఇక లాభాలు పొందడానికి కావాలని బంగారంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో భారతదేశంలోని 15 శాతం కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. 2023లో ఆ సంఖ్య 21 శాతానికి పెరిగింది. పైగా రాబడి కూడా బాగుంటోంది. సో, భవిష్యత్తులో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ బంగారమే సగటు కుటుంబానికి, దేశానికి శ్రీరామరక్ష అని చెప్పాలి.

Gold Investment

మరిన్ని ప్రీమియం వార్తల కోసం క్లిక్ చేయండి..