AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న టికెట్ బుకింగ్ రూల్స్.. ఇకపై 60 రోజులే ఛాన్స్..

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇప్పటివరకు 4 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటుకు భారతీయ రైల్వే బ్రేక్ వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి ఏకంగా 60 రోజులకు కుదిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం నవంబర్ 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. టికెట్ల బ్లాకింగ్, దళారుల దోపిడీకి చెక్ పెడుతూ తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న టికెట్ బుకింగ్ రూల్స్.. ఇకపై 60 రోజులే ఛాన్స్..
Indian Railways New Rules
Krishna S
|

Updated on: Oct 31, 2026 | 6:29 PM

Share

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే నెట్‌వర్క్ మరో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. సామాన్యుల ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 120 రోజుల ముందస్తు రిజర్వేషన్ గడువును సగానికి తగ్గిస్తూ, కేవలం 60 రోజులకు పరిమితం చేసింది. ఈ సరికొత్త నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచే అధికారికంగా అమల్లోకి వస్తోంది. ప్రయాణికులు ఐఆర్‌సిటీసీ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఈ మార్పును దృష్టిలో ఉంచుకోవాలని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.

అసలేంటీ మార్పు? ఎందుకు తగ్గించారు?

గతంలో రైలు ప్రయాణానికి 4 నెలల ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇంత సుదీర్ఘ గడువు ఉండటం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నట్లు రైల్వే శాఖ అంతర్గత పరిశీలనలో తేలింది. చాలామంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణ సమయానికి ప్లాన్స్ మారడంతో చివరి క్షణంలో భారీగా టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. దీనికితోడు కొందరు దళారులు, ఏజెంట్లు ముందస్తుగానే కీలక రూట్లలో టికెట్లను బ్లాక్ చేసి, డిమాండ్ ఉన్న సమయాల్లో సామాన్య ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసి, నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్ సీట్లు లభించేలా చేయడానికే అక్టోబర్ 17న తీసుకున్న ఈ నిర్ణయాన్ని నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు.

మునుపటి బుకింగ్స్‌పై ప్రభావం ఉండదు

ఈ నూతన నిబంధన కేవలం నవంబర్ 1 తర్వాత కొత్తగా చేసుకునే బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే 120 రోజుల నిబంధన ప్రకారం బుక్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లు యథావిధిగా చెల్లుబాటవుతాయి. అలాగే విదేశీ పర్యాటకులకు కేటాయించిన ప్రత్యేక 365 రోజుల అడ్వాన్స్ విండోలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టమైంది. అలాగే తాజ్‌ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్‌ వంటి తక్కువ దూర ప్రయాణాలకు వర్తించే స్వల్పకాలిక అడ్వాన్స్ పరిమితుల్లోనూ మార్పు ఉండదు.

తోడవుతున్న ఏఐ టెక్నాలజీ

ముందస్తు బుకింగ్ వ్యవధిని తగ్గించడంతో పాటు రైల్వే డిజిటల్ వ్యవస్థను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో మరింత పటిష్టం చేస్తోంది. ఏయే మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది? ఏ రైళ్లలో బెర్త్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది? టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి? అనే డేటాను ఏఐ ద్వారా ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా విశ్లేషిస్తున్నారు. ఏఐ ఆధారిత ఫీచర్ల వల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరింత ఖచ్చితత్వంతో నిర్ణయించుకునే వీలు కలుగుతోంది.

ప్రయాణికుల మిశ్రమ స్పందన

ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 60 రోజుల పరిమితి వల్ల దళారుల బెడద తగ్గి, చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ల గందరగోళం తగ్గుతుందని ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో సుదూర ప్రాంతాలకు ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే వారికి 60 రోజుల వ్యవధి కాస్త ఇబ్బందికరంగా మారుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ప్రయాణ ప్రణాళికలు వేసుకునే వారు మారిన 60 రోజుల గడువును గమనించి టికెట్లను రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Follow Us