Smartphone Exports: స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారత్ రికార్డు.. ఐఫోన్ల వాటా ఎంతంటే?

భారతదేశంలో తయారీ రంగం రోజురోజుకీ వృద్ది చెందుతుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు భారత్‌లో తమ తయారీ యూనిట్లు స్థాపించడంతో ఎగుమతులు కూడా ఊపందుకున్నాయి. భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం వల్లే ఈ స్థాయి రికార్డు నమోదైందని పేర్కొన్నారు.

Smartphone Exports: స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారత్ రికార్డు.. ఐఫోన్ల వాటా ఎంతంటే?
Smartphone Exports

Updated on: Apr 09, 2025 | 4:00 PM

భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 54 శాతం పెరిగాయి. ఈ వృద్ధి వరల్డ్ వాల్యూ చైన్‌లో భారతదేశానికి సంబంధించిన ఏకీకరణను ప్రతిబింబిస్తుందని, అలాగే భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. భారతీయ ఎంఎస్ఎంఈలు ఇప్పుడు ప్రపంచంలో కీలకంగా మారుతున్నాయని వివరించారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఎగుమతుల పెరుగుదలకు ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ ప్రధానం కారణమని ఆయన పేర్కొన్నారు. పీఎల్ఐ స్కీమ్ వల్ల స్థానిక ఉత్పత్తిని గణనీయంగా పెరిగిందని వివరించారు. ముఖ్యంగా భారతదేశం దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 99 శాతం దేశీయంగా తయారవుతున్నాయని తెలిపారు. 

ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనాలు 2025 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 20 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అయితే తుది సంఖ్య ఈ అంచనాను సులభంగా అధిగమించింది. దీన్ని బట్టి ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశ పాత్రను  అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం షిప్‌మెంట్‌లలో దాదాపు 70 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా తమిళనాడులోని ఫాక్స్‌కాన్ సౌకర్యం ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారింది. 

భారతదేశం నుంచి ఎగుమతైన ఐఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు సగం ఎగుమతులు ఫాక్స్‌కాన్ నుంచే ఎగుమతయ్యాయి. అలాగే ఈ ఎగుమతులు సంవత్సరానికి 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ కూడా స్మార్ట్‌ఫోన్ రంగంలో తన మార్క్‌ను చూపిస్తుంది. కర్ణాటకలోని విస్ట్రాన్ సౌకర్యంలో దాని వాటా, పెగాట్రాన్ తమిళనాడు యూనిట్‌లో 60 శాతం వాటా భారతదేశంలో ప్రధాన ఐఫోన్ తయారీదారుగా దాని స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి. అలాగే సుంకాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం వలల్ భారతదేశం నుంచి ఐఫోన్‌ల ఎగుమతులు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి