Traffic Fines: వాహనాదారులకు బిగ్ అలర్ట్.. ఆ తప్పు చేస్తే జరిమానా బాదుడు తప్పదంతే..!
భారతదేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలా శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే షాక్ కొట్టేలా జరిమానాలను సవరించింది. ఈ సవరణలు మార్చి1 నుంచే అమల్లోకి వచ్చాయి.

దేశంలో ర్యాష్ డ్రైవింగ్‌ను అరికట్టడానికి, రోడ్డు భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను భారీగా పెచింది. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ట్రాఫిక్ జరిమానాల గురించి చాలా మందికి తెలియదు. కొంతమంది ఉన్నత వర్గం వారైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తక్కువ ఫైన్ కదా? కట్టేద్దామనే ధోరణిలో ఉంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా భారీ జరిమానాలు, కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలను సవరించారు. కాబట్టి ఏయే తప్పునకు ఎంత జరిమానాను విధిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
తాగి వాహనం నడపడం
మద్యం తాగి వాహనం నడిపితే ఇప్పుడు కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మొదటిసారి నేరం చేస్తే దోషులకు రూ.10,000 జరిమానాలేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. అయితే పదే పదే నేరం చేస్తే రూ.15,000 జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఈ జరిమానాలు రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండేవి.
హెల్మెట్, సీట్ బెల్ట్ ఉల్లంఘనలు
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు పట్టుబడితే ఇప్పుడు రూ.1,000 వసూలు చేస్తారు. గతంలో ఈ జరిమానా రూ.100 ఉండేది. ఇప్పుడు ఏకంగా పది రెట్లు పెంచారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్‌ను కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సీట్ బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించే వారికి కూడా రూ.1,000 జరిమానా విధిస్తారు.
మొబైల్ ఫోన్ వాడకం
ముఖ్యంగా మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఇటీవల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. మొబైల్ మాట్లాడుతూ పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణం అవుతుంది. ఈ ప్రమాదాల నివారణకు అధికారులు జరిమానాను రూ. 500 నుంచి రూ.5,000కు పెంచారు.
లైసెన్స్
లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానాను రూ.5,000కు పెంచారు. వాహనానికి బీమా చేయకపోతే రూ.2,000 జరిమానా విధిస్తారు. పదేపదే బీమా ఉల్లంఘించిన వారికి రూ.4,000 వసూలు చేస్తారు . కాలుష్య ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే రూ.10,000 జరిమానా, జైలు శిక్ష లేదా సమాజ సేవ కూడా విధిస్తారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్
ద్విచక్ర వాహనంపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే రూ.1,000 జరిమానా విధిస్తారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రేసింగ్‌లో పట్టుబడినా రూ.5,000 జరిమానా విధిస్తారు. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలను అడ్డుకుంటే రూ.10,000 జరిమానా విధిస్తారు.
సిగ్నల్స్ జంప్, ఓవర్ లోడింగ్
సిగ్నల్ జంప్ చేస్తే రూ.5,000 జరిమానా విధిస్తారు అలాగే రవాణా వాహనాలను ఓవర్ లోడ్ చేస్తే రూ.20,000 జరిమానా విధిస్తారు.
మైనర్లు వాహనం నడిపితే
మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే షాక్ కొట్టే జరిమానాలను పెంచారు. వాహన యజమానికి రూ.25,000 జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు పట్టుబడిన మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లై సెన్స్ మంజూరు చేయకుండా నిషేధం విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి