Income Tax Rules: మీ అకౌంట్‌లో ఈ లావాదేవీలు జరిగితే.. ఇన్‌కమ్ ట్యాక్స్‌కి తెలిసిపోతుంది! ఇలా జాగ్రత్తపడండి!
మీ బ్యాంక్ అకౌంట్‌తో చేసే ప్రతి ట్రాన్సాక్షన్.. అంటే బిల్లు చెల్లింపులు, ఈఎంఐలు, శాలరీ ఇలా.. అన్నీ ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లకు తెలుస్తాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌తో చేసే ట్రాన్సాక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసే కొన్ని ట్రాన్సాక్షన్ల వల్ల మీరు ఇన్ కమ్‌ట్యాక్స్ ఇబ్బందుల్లో పడొచ్చు. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందికి ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి.. వాటితో వచ్చే ఇబ్బందుల గురించి తెలియదు. ఇప్పుడున్న డేటా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద లావాదేవీలపై ఓ కన్ను వేసి ఉంచుతుంది. వీటిలో ఏవైనా పొరపాట్లు జరిగినా లేదా అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఐటీ అధికారులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌లో చేసే ట్రాన్సాక్షన్స్ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముందుగానే ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన కొన్ని రూల్స్ తెలుసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు.
పెద్ద మొత్తంలో..
ఏదైనా అవసరం చేత పెద్ద మొత్తంలో డబ్బుని మీ అకౌంట్ లో పదేపదే జమ చేయడం ద్వారా ఐటీ(ఇన్‌కమ్ ట్యాక్స్) వాళ్లు మీ అకౌంట్ ను గమనించే అవకాశం ఉంది. దానివల్ల ఐటీ అధికారులు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీసే అవకాశం ఉంటుంది.
లిమిట్ ఇంతే..
ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో రూ.10 లక్షలకు మించి మీ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ అయితే ఆ సమాచారాన్ని బ్యాంకులు ఐటీ వాళ్లకు పంపిస్తాయి. మీరు ఆ డబ్బుకి సంబంధించిన వివరాలను ఐటీఆర్‌లో చూపించాలి. లేకపోతే ఐటీ నుంచి నోటీసు రావొచ్చు.
క్రెడిట్ కార్డులు
ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే కూడా కొన్నిసార్లు ఇబ్బందే. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ. 7 లక్షలు అయితే మీరు ప్రతి నెలా రూ.లక్ష క్రెడిట్ కార్డు బిల్లు కడుతూ ఉంటే.. అప్పుడు మీ వివరాలు ఐటీ వాళ్లకు తెలిసే అవకాశం ఉంటుంది. అధిక చెల్లింపులకు గల కారణాలను ఐటీ వాళ్లు అడగొచ్చు.
ఆస్తి కొనుగోళ్లు
మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినా లేదా అమ్మినా ఆ వివరాలు ఐటీ వాళ్లకు తెలుస్తాయి. ముఖ్యంగా రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువ గల ఆస్తి లావాదేవీల గురించి ఐటీ శాఖ ఆరా తీసే అవకాశం ఉంది. ఇల్లు, కారు లేదా స్థలం వంటివి కూడా ఇందులో భాగమే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




