కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. 2015లో ప్రారంభించిన ఈ పథకంలో కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది ఖాతాలు తెరిచారు. ఇంత బంపర్ రెస్పాన్స్ రావడంతో పోస్టల్ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆడ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ స్కీం కింద, తన కుమార్తె కోసం ఖాతా తెరిస్తే.. ఆమె విద్య నుంచి పెళ్లి వరకు అన్ని ఖర్చులను తండ్రి సమకూర్చవచ్చు.
‘బేటీ బచావో బేటీ పఢావో’ మిషన్ కింద మోదీ సర్కార్ ప్రారంభించిన ఈ పథకం చిన్న పొదుపు పధకాల కిందకు వస్తుంది. ఈ స్కీంలో ఆడపిల్లల పేరు మీద 15 ఏళ్ల పాటు ఖాతా తెరవచ్చు. అలాగే ఈ పధకంలో పొదుపు చేసే మొత్తానికి ప్రభుత్వం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అందుకే ప్రజలు ఈ పథకంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి దోహదపడింది. అలాగే బడ్జెట్ 2023 తర్వాత, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసే క్రమంలో పోస్టల్ శాఖ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని వల్ల కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది సుకన్య సమృద్ది యోజన ఖాతాలు తెరిచారు.
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి పోస్టాఫీస్ అత్యధిక వడ్డీ రేటు 7.60 శాతం చెల్లిస్తుంది. మీరు ఈ ఖాతాను మీకు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఈ ఖాతాలో కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేయొచ్చు. ఒక నెల లేదా సంవత్సరంలో మీరు ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. కుటుంబంలో ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవగలరు. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల ఖాతాలు తెరవవచ్చు. 10 ఏళ్ల లోపు ఆడపిల్లల కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కాగా, ఆదాయపు పన్ను సెక్షన్ 80 సి కింద ఈ పధకానికి పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.