House Auction: బ్యాంక్ వేలంలో వచ్చిన ఇల్లు కొనుక్కుంటే లాభం ఉంటుందా?

బిడ్డింగ్ చేయడానికి ముందు ఆస్తి టైటిల్ డీడ్‌ను తనిఖీ చేయండి. రిజిస్ట్రీ, చైన్ డీడ్ తనిఖీ చేయండి. ఏదైనా చట్టపరమైన వివాదంలో ఆస్తి ప్రమేయం లేదని నిర్ధారించుకోండి. దీని కోసం మీరు న్యాయవాదిని..

House Auction: బ్యాంక్ వేలంలో వచ్చిన ఇల్లు కొనుక్కుంటే లాభం ఉంటుందా?
House Auction
Follow us
Subhash Goud

| Edited By: Narender Vaitla

Updated on: May 06, 2023 | 2:21 PM

అరుణ్ కిరణ్ ఇద్దరూ స్నేహితులు. ఒకదగ్గర కలుసుకున్నారు. వారిద్దరూ తమ పాత ముచ్చట్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇదే సమయంలో అరుణ్ తాను కొత్త ఇల్లు తీసుకున్నాననీ దాని గృహప్రవేశం త్వరలో ఉందనీ.. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలనీ కిరణ్ ను ఆహ్వానించాడు. ఇది విన్న కిరణ్ చాలా సంతోషించాడు. ఒక ఇంటి వాడు అవుతున్నందుకు అరుణ్ ను అభినందించాడు. తరువాత ఇంటి గురించి వివరాలు అడిగాడు కిరణ్. తాను ఆ ఇంటిని బ్యాంకు వేలం ద్వారా కొన్నట్టు అరుణ్ చెప్పాడు. బ్యాంకు వేలంలో ఇల్లు కొనడం ఏమిటంటూ ఆశ్చర్యపోయాడు కిరణ్.

అరుణ్ మాదిరిగానే మీరు కూడా వేలం ద్వారా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? వాస్తవానికి బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు లేదా కంపెనీలు అప్పుగా ఇచ్చిన డబ్బును లోన్ తీసుకున్నవారు తిరిగి చెల్లించనప్పుడు, లోన్ హోల్డర్ కు తగిన నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకు తాకట్టు పెట్టిన ఆస్తిని వేలం వేయవచ్చు. ఆస్తి ఎప్పుడు వేలానికి వెళుతుంది. అలాగే అటువంటి ఆస్తిని ఎలా కొనుగోలు చేయవచ్చు? తెలుసుకుందాం!!

2002 నాటి సర్ఫేసీ చట్టం నష్టాలను తిరిగి పొందేందుకు ఆస్తులను విక్రయించే హక్కును బ్యాంకులకు ఇచ్చింది. చాలా బ్యాంకులు ఆస్తుల ఇ-వేలం నిర్వహిస్తాయి. వార్తాపత్రికలు, బ్యాంక్ వెబ్‌సైట్‌లు లేదా వేలం రికార్డులను ఉంచే పోర్టల్‌లలో సమాచారాన్ని కనుగొనవచ్చు. లోన్ హోల్డర్ వరుసగా మూడు EMIలను చెల్లించడంలో విఫలమైతే, బ్యాంక్ వేలం ప్రక్రియను ప్రారంభిస్తుంది. తమ ఆస్తిని ఎందుకు వేలం వేయకూడదని బ్యాంకు లోన్ హోల్డర్ కు నోటీసు పంపుతుంది. నోటీసుకు ప్రతిస్పందించడానికి లోన్ హోల్డర్ కు 60 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో రుణగ్రహీత చెల్లింపు చేస్తే, నోటీసు ఉపసంహరించుకుంటారు. రుణగ్రహీత నోటీస్‌కు ప్రతిస్పందించనట్లయితే లేదా, ప్రతిస్పందనతో బ్యాంక్ సంతృప్తి చెందకపోతే నోటీసులో పేర్కొన్న కాలపరిమితి ముగిసిన 30 రోజుల తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

వేలంలో ఆస్తులు సాధారణంగా మార్కెట్ ధర కంటే 10 నుంచి 30 శాతం తక్కువ ధరకు విక్రయిస్తారు. అంటే కోటి రూపాయల విలువైన ఆస్తి దాదాపు రూ.70-90 లక్షలకు లభించవచ్చు. ఎందుకంటే బ్యాంకు దృష్టి తన మూలధనాన్ని రికవరీ చేయడంపైనే ఉంది. వేలంలో విక్రయించే చాలా ఆస్తులు పాష్ ప్రాంతాలలో ఉన్నాయి. చాలా సార్లు మీరు అటువంటి వేలంలో మంచి ప్రదేశంలో ఆస్తిని కనుగొనవచ్చు. ఈ ప్రాపర్టీలు ఎక్కువగా వెంటనే ఆక్యుపై చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. అందువల్ల డీల్ పూర్తయిన వెంటనే కొనుగోలుదారు మారవచ్చు.

వేలంలో ఆస్తిని కొనుగోలు చేయడం అనేది క్లియర్ టైటిల్‌కు సూచనగా చెప్పవచ్చు. అంటే ఆ ఆస్తి విషయంలో ఎటువంటి లీగల్ రిస్క్ ఉండే అవకాశం ఉండదని భావించవచ్చు. బ్యాంకులు తమ వేలం నోటీసులో ఎక్కడ ఉన్నది.. అలాగే ఉన్నట్టుగా అని పేర్కొంటుంది. అంటే భౌతికంగా చట్టబద్ధంగా అప్పుడు ఉన్న స్థితిలో వేలం వేస్తున్నారని దాని అర్ధం. అయితే, వేలం పూర్తి అయి.. ఆస్తిని తీసుకున్నవారు స్వాధీనం చేసుకున్న తరువాత ఆ ఆస్తిపై ఏదైనా క్లయిమ్ తో థర్డ్‌ పార్టీ వస్తే డానికి బ్యాంక్ బాధ్యత వహించదు.

వేలంపాటలో ఎవరైనా ఆస్తిని కొన్నారని చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ ఏళ్లు గడిచినా ఆ ఆస్తి అతనికి దక్కలేదు అని కూడా చెబుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో, ప్రాపర్టీల సింబాలిక్ స్వాధీనం ఆధారంగా వేలం నిర్వహిస్తారు. సింబాలిక్ పొసెషన్‌లో బ్యాంకులు కాగితంపై ఆస్తిపై చట్టపరమైన హక్కులను కలిగి ఉంటాయి. అయితే ఆస్తి స్వాధీనం మునుపటి యజమాని లేదా అద్దెదారు వద్ద ఉంటుంది. వేలానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లవచ్చు. అటువంటి సందర్భంలో ఆ కోర్టు కేసు తేలే వరకూ ఆస్తి స్వాధీనం చేసుకోవడం వీలు పడదు. అందుకే ఆస్తి భౌతిక స్వాధీనం బ్యాంకుకు చాలా ముఖ్యం. భౌతిక స్వాధీనత లేకపోతే, వేలంలో అటువంటి ఆస్తిని కొనుక్కున్నా మీరు చట్టపరమైన సమస్యలలో చిక్కుకోవచ్చు.

బిడ్డింగ్ చేయడానికి ముందు ఆస్తి టైటిల్ డీడ్‌ను తనిఖీ చేయండి. రిజిస్ట్రీ, చైన్ డీడ్ తనిఖీ చేయండి. ఏదైనా చట్టపరమైన వివాదంలో ఆస్తి ప్రమేయం లేదని నిర్ధారించుకోండి. దీని కోసం మీరు న్యాయవాదిని సంప్రదించవచ్చు. ఆస్తి కంపెనీకి చెందినదైతే, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద విచారించండి. వేలంలో కొనుగోలు చేయడానికి ముందు ఆస్తి పరిస్థితిని తనిఖీ చేయండి. ఒకవేళ ఆ ఆస్తికి ఏదైనా రిపేర్లు అవసరం అయితే.. డానికి మీరు ఎంత ఖర్చు చేయవలసి వస్తుందో దీని ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది.

దీనితో పాటు, ఆస్తి మునిసిపల్ పన్ను, సొసైటీ ఛార్జీలు, పెండింగ్ విద్యుత్, నీటి బిల్లులు, ఇతర వాటి గురించి కూడా తెలుసుకోండి. వేలంలో ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, బకాయిలను చెల్లించే బాధ్యత కొనుగోలుదారుపై ఉంటుంది. అందువల్ల, బిడ్ వేసేటప్పుడు అలాంటి ఖర్చులను గుర్తుంచుకోండి. లేకపోతే, వాస్తవ ధర మీ అంచనాను మించిపోవచ్చు.

మీరు కూడా అరుణ్ లా వేలం వేసిన ఆస్తులలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి, 10% రిజర్వ్ ధరను డబ్బుగా డిపాజిట్ చేయాలి. మీ బిడ్ విఫలమైతే, డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి ఇస్తారు. బిడ్ గెలుపొందిన తర్వాత, 25% మొత్తాన్ని రాబోయే కొద్ది రోజుల్లో డిపాజిట్ చేయాలి. మిగిలిన మొత్తాన్ని ఒక నెలలోపు లేదా బ్యాంక్ చెప్పిన నిర్దిష్ట సమయంలో చెల్లించాలి. ఒకవేళ మీరు బిడ్ గెలిచిన తరువాత పేమెంట్ చేయకపోతే కనుక మీ డిపాజిట్ డబ్బు మీకు వెనక్కి రాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి