
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఈ 2026 సంవత్సరంలో మీ కలను నిజం చేసుకోవడానికి బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లోన్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన ప్రశ్న.. ఏ వడ్డీ రేటును ఎంచుకోవాలి? అని. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ డ్డీ రేట్లలో మీకు ఏది లాభదాయకమో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ వడ్డీ రేటును ఎంచుకోవాలనేది పూర్తిగా మీ ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్థ్యం, మీ భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది.
ఫ్లోటింగ్ రేటులో వడ్డీ రేట్లు రుణ కాలపరిమితి మొత్తం ఒకేలా ఉండవు. ఆర్‌బీఐ రెపో రేట్లకు అనుగుణంగా ఇవి మారుతూ ఉంటాయి. మీ ఉద్యోగం స్థిరంగా ఉండి, అధిక ఆదాయం ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల భవిష్యత్తులో ఈఎంఐ పెరిగినా భరించగలిగే రిస్క్ ఉన్న వారికి ఇది మేలు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయని మీరు భావిస్తే, ఫ్లోటింగ్ రేటుతో మీపై భారం తగ్గుతుంది.
స్థిర వడ్డీ రేటులో, మీరు తీసుకున్న రుణ కాలపరిమితి ముగిసే వరకు వడ్డీ రేటు మారదు. మీరు చెల్లించే ఈఎంఐ ప్రతి నెలా ఒకేలా ఉంటుంది. తక్కువ ఆదాయం ఉండి, ఖచ్చితమైన నెలవారీ బడ్జెట్ పాటించే వారికి ఇది ఉత్తమం. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, భవిష్యత్తులో ఈఎంఐ పెరిగి బడ్జెట్ తలకిందులు కాకూడదు అనుకునేవారు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఉద్యోగ భద్రతపై ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు, స్థిరమైన ఈఎంఐ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
సాధారణంగా ఫ్లోటింగ్ రేట్ల కంటే స్థిర వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. స్థిరత్వం కోరుకునే వారు కొంచెం అదనపు వడ్డీ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడండి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీ హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి