Hero Electric Scooter: రోడ్లపై రయ్ రయ్ మననున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏకంగా 165 కిలోమీటర్ల మైలేజీతో..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లను డెలివరీ చేయడం ప్రారంభించింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో వినియోగదారులకు వాటిని అందిస్తోంది.
ప్రస్తుతం ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ ఎలక్ట్రిక్ వాహనాలు. వినియోగదారుల నుంచి ఉన్న డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేసి వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే కోవలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లను డెలివరీ చేయడం ప్రారంభించింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో వినియోగదారులకు వాటిని అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత అక్టోబర్ లోనే లాంచ్..
హీరో మోటార్ కార్ప్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘హీరో విడా’ను అక్టోబర్ 2022లోనే భారత మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ స్కూటర్‌ను V1 ప్రో, V1 ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. Vida V1 ప్రో ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్), V1 ప్లస్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ రెండింటిలో పోర్టబుల్ బ్యాటరీలు అందుబాటులో ఉంచింది. అంటే వినియోగదారులు స్కూటర్ నుంచి బ్యాటరీని బయటకు తీసి చార్జింగ్ పెట్టుకోవచ్చన్నమాట.
వావ్ అనేలా ఫీచర్లు..
తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్నో అద్భుత ఫీచర్లు ఉన్నాయి. టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాక హీరో విడా V1 రెండు వేరియంట్ల ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 80Kmphగా ఉంది. V1 ప్లస్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 143 కిలోమీటర్లు, V1 ప్రో 165 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అంతేకాక ఈ స్కూటర్లు 8-అంగుళాల TFT డాష్ టచ్ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. రెండింటికీ స్మార్ట్‌ఫోన్ కనెక్టెవిటీని కూడా ఉంది.
ఏయే నగరాల్లో డెలివరీ అంటే..
తొలుత ఈ-స్కూటర్ బెంగళూరు, జైపూర్, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా బెంగళూరులో కంపెనీ హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని ఇప్పటికే ప్రారంభించింది. ఈ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీని హీరో స్వయంగా అభివృద్ధి చేసింది. పైగా ఇది పోర్టబుల్ కావడంతో వినియోగదారునికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. రెండు బ్యాటరీలను తీసుకుంటే ఒకటి తీసి చార్జింగ్ పెట్టుకొని, మరొక దానిని ఎంచక్కా వినియోగించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..