TCS: విదేశాలకు డబ్బు పంపాలా? అయితే దీని గురించి తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు..
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ లావాదేవీలపై ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ లావాదేవీలపై ఈ రేట్లు 5 శాతం నుంచి 20 శాతానికి పెరిగాయి. జూలై 1 నుంచి ఈ పెంచిన ఈ రేట్లు అమలులోకి వస్తాయి.
ప్రస్తుత యువతకు ఫారిన్ లో చదువుకోవడం ఓ కల. డిగ్రీ లేదా పీజీ లను యూఎస్ లేదా యూకేలో చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఫారిన్ మైగ్రేషన్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే అక్కడ చదువులంటే కాస్త ఖర్చుతో కూడుకున్నావే. చదువుల కోసం మాత్రమే కాక ప్రయాణ ఖర్చులు, అక్కడ ఉండటానికి అంతా భారీగా ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇక్కడ నుంచి డబ్బులు పంపాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అలా పంపేటప్పుడు టీసీఎస్(ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) చెల్లించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు మీ పిల్లలకు పంపే మొత్తంలో ఇది కట్ అవకుండా పంపాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ కథనం చదవండి..
ఈ మార్పులు తెలుసా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2023 కేంద్ర బడ్జెట్ పర్సనల్ ఫైనాన్స్ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చారు. వాటిల్లిలో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ లావాదేవీలపై చెల్లించే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) ఒక ముఖ్యమైన మార్పు. విదేశీ లావాదేవీలపై ఈ రేట్లు 5 శాతం నుంచి 20 శాతం వరకూ పెరిగాయి. జూలై 1 నుంచి ఈ పెంచిన రేట్లు అమలులోకి వస్తాయి. అయితే ఈ సవరించిన రేట్లు విద్య, వైద్య ప్రయోజనాలకు సంబంధించిన ఖర్చులకు వర్తించవు. అయితే విదేశీ పర్యటనలు, విదేశీ పెట్టుబడులు, విదేశాలకు డబ్బు బదిలీలు వంటి ఇతర చెల్లింపులకు మాత్రం 20శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
పత్రాలు పక్కాగా ఉండాలి..
తల్లిదండ్రులు పంపిన డబ్బు విద్యా ప్రయోజనాల కోసం అని నిర్ధారించడానికి సరైన డాక్యుమెంటేషన్ ఉండాలి. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా విదేశాలకు డబ్బు పంపడానికి గల కారణాన్ని రెమిటెన్స్ ఫారమ్‌లో స్పష్టంగా పేర్కొనాలి. బదిలీ చేసేటప్పుడు సమర్పించాల్సిన డాక్యుమెంటేషన్ అవసరాల గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంతర్జాతీయ అద్దె ఒప్పందాలు, ఇన్‌వాయిస్‌లు, విశ్వవిద్యాలయ అడ్మిషన్ లెటర్స్ వంటి పత్రాలు అవసరం. ఇవి మీరు ఇస్తున్న నగదు విదేశీ విద్యకోసం అని ప్రభుత్వానికి తెలియజేస్తాయి.
పరిమితులుంటాయి..
విద్య కోసం చెల్లింపుల విషయంలో, ప్రతి వ్యక్తికి ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు పంపిన డబ్బు రూ. 7 లక్షలు దాటితే టీసీఎస్ వర్తిస్తుంది. దీన్ని నివారించడానికి, తల్లిదండ్రులు చెల్లింపులను విభజించి, తండ్రి, తల్లి లేదా తోబుట్టువుల వంటి తక్షణ కుటుంబ సభ్యుల ద్వారా నిధులను బదిలీ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా, విదేశాల్లో చదువుతున్న విద్యార్థి ఖర్చులను కవర్ చేస్తూ ఒక్కో బదిలీ మొత్తం రూ.7 లక్షల కంటే తక్కువగానే ఉంటుంది. అయితే మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల విషయంలో కాకుండా, ఫారెక్స్ కార్డ్ వినియోగంపై రూ.7 లక్షల థ్రెషోల్డ్ లేదు. అలాగే ఈ టీసీఎస్ అనేది స్వతంత్ర పన్ను కాదని గమనించడం ముఖ్యం. ఇది ఫారమ్ 26ఏఎస్ లో పన్ను క్రెడిట్‌గా ప్రతిబింబిస్తుంది. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ని ఫైల్ చేసేటప్పుడు చెల్లించాల్సిన పన్నుపై క్లెయిమ్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..