Child Future Planning: మీ పిల్లల చదువు,పెళ్లిళ్ల కోసం దిగులొద్దు.. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. నిశ్చింతగా ఉండండి..
భారత ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాయాలనుకొనే వారి కోసమే కొన్ని ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ.. పిల్లల బంగారు భవితకు బాటలు వేయవచ్చు. అయితే ప్రతి పథకం కొన్ని షరతులు, నిబంధనలకు లోబడి ఉంటాయి.
తల్లిందండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తాపత్రయ పడుతుంటారు. వారి జీవితంలో ఎక్కువ భాగం వారి పిల్లల బాగు గురించే ఆలోచిస్తుంటారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే సరిపోదు. ఆ సొమ్మును మంచి సురక్షిత పథకాలలో పెట్టుబడి పెడితే వాటి ద్వారా భవిష్యత్తులో అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాయాలనుకొనే వారి కోసమే కొన్ని ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ.. పిల్లల భవితకు బాటలు వేయవచ్చు. అయితే ప్రతి పథకం కొన్ని షరతులు, నిబంధనలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఆ పథకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సుకన్య సమృద్ధి యోజన (SSY).. సుకన్య సమృద్ధి యోజన అనేది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల చదువు,పెళ్లి ఖర్చుల కోసం డబ్బును ఆదా చేసేందుకు రూపొందించిన పథకం. అందుబాటులో ఉన్న అన్ని పథకాల్లో కన్నా ఈ పథకం అధిక-వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి. పదిహేను ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.6శాతంగా ఉంది. వచ్చే రాబడిపై పన్ను మినిహాయింపులు ఉంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF).. ఇది సురక్షితమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు దీనిపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఏడాదికి రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC).. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం. దీనికి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై వచ్చే వడ్డీపై పన్ను విధించబడుతుంది, కానీ పెట్టుబడిదారులు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS).. ఇది మ్యూచువల్ ఫండ్స్ ఉండే బెస్ట్ పథకం. ఇది మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. ఇది సెక్షన్ 80సీ కింద అధిక రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ వ్యవధిలో అధిక రాబడి కావాలనుకొనే వారికి ఇది బెస్ట్ ఎంపిక.
కిసాన్ వికాస్ పత్ర (KVP).. ఇది కూడా స్థిరమైన ఆదాయానిన అందించే మంచి పెట్టుబడి పథకం. 124 నెలల స్థిర పదవీకాలం తర్వాత పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది. సంపాదించిన వడ్డీపై పన్ను విధించబడుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS).. ఇది కూడా అధిక వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలను అందించే స్కీమ్. కేవలం సీనియర్ సిటిజెన్స్ కోసమే రూపొందించిన పథకం ఇది. మీరు మీ పిల్లల కోసం ధనం కూడబెట్టాలనుకుంటే మీ తల్లిదండ్రులు పేరు మీద పిల్లల కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
మీ లక్ష్యానికి అనుగుణంగా..
ప్రతి ప్రభుత్వ పథకానికి దాని సొంత అర్హత ప్రమాణాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు అర్హత, అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మీ ఆర్థిక అవసరాలు, ఆదాయాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టే ముందు, పాలసీ సలహాదారుని లేదా స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్న వ్యక్తిని సంప్రదించండి.
ఇది తప్పనిసరి..
మీరు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటుంటే ముందు మీరు ఆ పథకం గురించి క్షుణ్ణంగా చదవాలి. నిబంధనలు, షరతులను తెలుసుకోవాలి. పథకం గురించి పూర్తిగా అవగాహనకు రావాలి. అలాగే మీరు దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. తర్వాత అది దిద్దుబాటు చేయడం కష్టమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..