AC: ఎండ నుంచి రాగానే ఏసీ గదిలోకి వెళ్తున్నారా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు
మండుతున్న ఎండల్లో బయట తిరిగి రాగానే ఏసీ గదిలోకి వెళ్తే వచ్చే ఆ కిక్కే వేరు. కానీ ఆ హాయి వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని మీకు తెలుసా.? ఎండ నుంచి రాగానే చల్లటి ఏసీ రూమ్‌లోకి వెళ్లడం వల్ల.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండ వేడికి తట్టుకోలేక అంతా ఏసీలకు అలవాటు పడిపోతుంటారు. బయట తిరిగి రాగానే వెంటనే ఏసీ స్విచ్ ఆన్ చేసి దాని ముందు కూర్చుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. అయితే, ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మన శరీరం బయట ఉన్న ఉష్ణోగ్రతకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. మనం ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం, రక్తనాళాల వ్యాకోచం వంటి ప్రక్రియల ద్వారా శరీరం స్థిరమైన ఉష్ణోగ్రతను మెయింటెన్ చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే ఒక సహజమైన రక్షణ మెకానిజం.
ఎండ నుంచి రాగానే ఒక్కసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఏసీ గదిలోకి వెళ్లినప్పుడు, మన శరీరంలోని ఆ రక్షణ మెకానిజమ్స్ దెబ్బతింటాయి. టెంపరేచర్‌లో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలతో పాటు తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది మన రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.
ఏం చేయాలి?
ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాసేపు నీడలో లేదా ఫ్యాన్ కింద కూర్చోవాలి. శరీర ఉష్ణోగ్రత కాస్త సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే ఏసీ గదిలోకి వెళ్లడం సురక్షితం. అలాగే ఏసీ గదిలోకి వెళ్ళే ముందే అతిగా చల్లగా ఉన్న నీటిని తాగడం కూడా మంచిది కాదు. కొద్ది నిమిషాల వ్యవధి ఇచ్చి వెళ్లడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also Read: కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది
