Health insurance premium: భారంగా మారుతున్న ఆరోగ్య బీమా ప్రీమియం..సీనియర్ సిటిజన్లకు మాత్రం ఉపశమనం
ఆధునిక కాలంలో మనిషి సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించాడు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. అదే సమయంలో అనేక రోగాల బారిన పడుతున్నాడు. కారణాలు ఏమైనా గానీ నేడు సుమారు 30 ఏళ్ల నుంచే అనారోగ్య సమస్యలు చుట్టుమడుతున్నాయి. వీటి చికిత్సకు ఆస్పత్రులలో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు.

కోవిడ్ అనంతరం ఆరోగ్య బీమా ప్రీమియాలు గణనీయంగా పెరిగాయి. అయితే సీనియర్ సిటిజన్లకు ఏడాదికి పది శాతానికి మంచి పెంచకూడదని ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య బీమా ప్రీమియాల పెంపునకు దేశంలో ఏర్పడిన ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం.. పాలసీదారులలో దాదాపు 53 శాతం మంది రెన్యూవల్ ప్రీమియం పెంపు పదిశాతం కంటే తక్కువగా ఉంది. 5 శాతం మందికి 30 శాతం కంటే ఎక్కువైంది. 2015 నుంచి 2025 వరకూ సుమారు పదేళ్లలో 200 శాతం వరకూ పెరుగుదల నెలకొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు వంద శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూశారు. ఈ పెరుగుదలను 2025 జనవరిలో భారత బీమా నియంత్రణ, అభివద్ది ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) గుర్తించింది. సీనియర్ సిటిజన్లకు వార్షిక పునరుద్దరణ ప్రీమియం పెంపును పది శాతానికి పరిమితం చేయాలని బీమా సంస్థలకు ఆదేశించింది.
ప్రీమియం పెంపు భారాన్ని తగ్గించుకోవడానికి పాలసీదారులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. చిన్న వయసున్న వారైతే తక్కువ ప్రీమియంలో మెరుగైన కవరేజీ అందించే కొత్త బీమా సంస్థకు మారిపోవచ్చు. పునరుద్ధరణ ప్రీమియాన్ని అంగీకరించడానికి బీమా సంస్థలు అందించే కొన్ని ఎంపికలకు అంగీకారం తెలుపవచ్చు. పరిమిత ఆసుపత్రుల నెట్ వర్క్ ను ఎంపిక చేసుకుంటే ప్రీమియంపై దాదాపు 15 శాతం తగ్గుతుంది. అలాగే ఒకేసారి రెండు, మూడేళ్ల ప్రీమియం చెల్లించడం ద్వారా 7.50 శాతం నుంచి 15 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు.
పాలసీదారుల క్లెయిమ్ లను కొన్నిసార్లు బీమా సంస్థలు తిరస్కరిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో పాక్షికంగా చెల్లింపులు జరుపుతాయి. ఇలాంటి సమయంలో తనకు అన్యాయం జరిగిందని పాలసీదారుడు భావిస్తే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. తనకు జరిగిన దానిపై ఫిర్యాదు పరిష్కార అధికారులకు (జీఆర్వో) లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఐఆర్డీఏఐ బీమా భరోసా పోర్టల్ ద్వారా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. బీమా సంస్థ నుంచి 30 రోజుల్లో మీకు సరైన సమాధానం రాకపోత జిల్లాలోని అంబుడ్స్ మన్ కార్యాలయాలను సంప్రదించాలి. ఇవన్నీ విఫలమైతే వీరు వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..