Health Insurance: ప్రస్తుతం ఆరోగ్య బీమా చేసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇన్సూరెన్స్‌ల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. కరోనా మహమ్మారి సందర్భంగా చాలా మంది ఆరోగ్య బీమాలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. గత ఏడాది నుంచి బీమా చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇక ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవలను విస్తరిస్తూ వస్తోంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఆరోగ్య బీమా పాలసీలను కస్టమర్లకు అందించేందుకు గూగుల్‌పేతో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్‌పే యాప్ ద్వారా ఇంటి నుంచే ఎటువంటి ఆటంకాలు లేకుండా, త్వరగా ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
గూగుల్ పేతో జతకట్టడం ఇదే తొలిసారి..
దేశంలోని బీమా సంస్థలతో గూగుల్ పే జతకట్టడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. కస్టమర్లు ఇకపై గూగుల్‌పేలో క్షణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ బీమా పాలసీని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అందిస్తోంది. టెక్నికల్ సర్వీస్‌ను మాత్రమే గూగుల్ పే అందిస్తుంది. ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, గూగుల్ పే జట్టుకట్టడం ఓ మంచి ప్రయత్నమని ఎస్‌బీఐ చెబుతోంది. అంతేకాకుండా గూగుల్‌పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవిని పేరుతో.. ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, కరోనా మహహ్మారి తర్వాత చాలా మంది ఆరోగ్య పాలసీలు చేసుకుంటున్నారు. వివిధ బీమా సంస్థలు కూడా వినియోగదారుల కోసం మంచి ప్రయోజనాలు కల్పించే స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎల్‌ఐసీతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.