LPG Subsidy: దేశంలో కొవిడ్ మహమ్మారి తగ్గిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఎల్‌పిజి సబ్సిడీని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఒక నివేదిక ప్రకారం.. దేశంలో వేగంగా పెరుగుతున్న LPG ధరను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నుంచి LPG సబ్సిడీని పునరుద్ధరించవచ్చు. జూలై 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని నిలిపివేసింది. సౌదీ అరామ్‌కో ప్రొపేన్ ధరను మెట్రిక్ టన్నుకు $ 870, బ్యూటేన్ మెట్రిక్ టన్నుకు $ 830 చొప్పున అందించింది. దీని కారణంగా దేశీయ మార్కెట్లో LPG ధర బాగా పెరిగింది. ప్రొపేన్ ధరలు మెట్రిక్ టన్నుకు $ 800 నుంచి $ 870, బ్యూటేన్ $ 795 నుంచి $ 830 వరకు పెరిగాయి. LGP సిలిండర్ గ్యాస్ ప్రొపేన్, బ్యూటేన్ మిశ్రమంతో నిండి ఉంటుంది. ఈ రెండు గ్యాస్‌ల ధరలు పెరగడంతో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి.
సిలిండర్ ధర ఎందుకు పెరిగింది..?
LPG సిలిండర్ బ్యూటేన్, ప్రొపేన్ మిశ్రమం 60, 40 నిష్పత్తిలో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రెండు గ్యాస్‌ల ధర పెరగడంతో ఎల్‌జీపీ సిలిండర్ ధర పెరిగింది. జూలై 2020లో ప్రభుత్వం LPG గ్యాస్ సిలిండర్‌లపై బ్సిడీని నిలిపివేసింది. 2020 సంవత్సరం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రొపేన్, బ్యూటేన్ ధరలు చాలా వేగంగా తగ్గాయి. అప్పుడు రెండు వాయువుల ధరలు సుమారు $565, $590గా ఉన్నాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి గ్యాస్ ధర భారీగా పెరిగింది. 10 నెలల రికార్డును పరిశీలిస్తే, ప్రొపేన్ ధర 122 శాతం, బ్యూటేన్ ధర 133 శాతం పెరిగింది. ఎల్‌పీజీ ధర పెరగడంతో పీఎం ఉజ్వల పథకం లబ్ధిదారులు సిలిండర్లను బుక్ చేసుకోవడం లేదు.
దీంతో ప్రజలు సంప్రదాయ ఇంధనాలతో వంట చేయడం ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 8 కోట్ల మంది PM ఉజ్వల పథకం లబ్ధిదారులలో దాదాపు 4.8 కోట్ల మంది వినియోగదారులు తమ LPG సిలిండర్‌లను కేవలం ఒక్కసారే రీఫిల్ చేసుకోవడం గమనార్హం. ఇకనుంచి ఉజ్వల కింద ప్రభుత్వం త్వరలో సబ్సిడీని ప్రారంభిస్తుంది. కానీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లేదా నెలకు రూ. 41000 ఉన్న కుటుంబాలకు మాత్రమే దీని ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది.