Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?

|

Mar 08, 2021 | 6:25 PM

Gold features : బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఏడు నెలల క్రితం గోల్డ్ రేటు 58వేలకు చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు..

Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?
Follow us on

Gold features : బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఏడు నెలల క్రితం గోల్డ్ రేటు 58వేలకు చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 46 వేలకు కాస్త అటుగా ఉంది. ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా? అనేది బంగారం ప్రియుల్లో పెద్ద డౌట్. ఇక, ఆగస్టు 8 2020… 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు- 55వేలు. మార్చి 8 2021..10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు- 42వేలు. 7 నెలల్లో 13 వేల రూపాయల తగ్గుదల… చిన్న విషయమేమీ కాదు. 2020 ఆగస్టు-సెప్టెంబరులో 10గ్రాముల మేలిమి బంగారం ధర 58,000 రూపాయల వరకూ వెళ్లింది. ఇప్పుడు 45 వేల రూపాయలకు అటు ఇటుగా ఉంది. ఏడు నెలల్లోనే 10 గ్రాముల మీద 12వేల రూపాయలు తగ్గింది. గతేడాది లాక్‌డౌన్ తర్వాత గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టింది. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌కు భయపడి లాక్‌డౌన్ అమలు చేయడంతో పెట్రోల్ వాడకం తగ్గి.. ముడి చమురు రేట్లు పాతాళానికి పడిపోయాయి. దీంతో పసిడికి అంతర్జాతీయంగా గిరాకీ పెరిగింది. యెల్లో మెటల్ కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటీ పడటంతో.. ధర అనూహ్యంగా పెరిగింది.

అన్‌లాక్ తర్వాత పరిస్థితులు మారాయి. ఒక్కో రంగం చిన్నగా ట్రాక్ మీదకు వచ్చింది. స్టాక్ మార్కెట్లలు లాభాల్లో పడ్డాయి. డాలర్ బలం పుంజుకుంది. భూముల ధరలు పెరుగుతున్నాయి. బిట్ కాయిన్ విలువ పెరుగుతోంది. ఈ అంశాలతో బంగారంలో పెట్టుబడులు తగ్గాయి. దీంతో రేటు తగ్గుతూ వస్తోంది. కరోనా విస్తరించక ముందు అంటే.. గతేడాది జనవరి 8న 22 కేరట్ల బంగారం ధర 40వేల రూపాయలు ఉంది. ఏడాది క్రితం అంటే మార్చ్‌ 8 న 43వేల రూపాయలు ఉంది. కోవిడ్ అనంతరం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వల్ల గోల్డ్ రేటు పెరిగిందనేది లెక్కలు చెబుతున్న వాస్తవం.

కోవిడ్ వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో పెరిగిన బంగారం.. వ్యాక్సిన్ వచ్చాక.. మునుపటి పరిస్థితులకు చేరుతోంది. అయితే కోవిడ్ వల్ల అస్తవ్యస్థమైన వ్యవస్థలు, ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. దీంతో బంగారం రేటు తగ్గినా.. భారీగా కొనుగోళ్లు లేవు. ఈ లెక్కలన్నీ చూస్తే.. రానున్న రోజుల్లోనూ పసిడి ధర తగ్గే అవకాశాలే ఎక్కువ. పెళ్లిళ్ల సీజన్ వస్తే డిమాండ్ పెరిగి రేట్లు పెరగచ్చు. గతేడాది బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం పైగా ప్రతిఫలం లభించడంతో, పుత్తడిపై అందరి చూపూ మళ్లింది. ఈ ఏడాదికి వచ్చేసరికి ఇప్పటికే ధర 5 శాతం వరకు తగ్గింది.

బంగారంపై పెట్టుబడి పెట్టాలా అనేది పూర్తికా విచక్షణతో తీసుకోవాల్సి నిర్ణయమే.. ప్రస్తుత పరిస్థితుల్లో రేటు పెరుగుతుందా.. ఇంకా తగ్గుతుందా అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే బంగారంలో ఎప్పుడు పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలంలో లాభాలే తప్ప నష్టాలు లేవు. యెల్లో మెటల్ ధర మరికాస్త తగ్గుతుందని… ఏడాది చివరిలోగా మళ్లీ ఇప్పుడున్న దాని కంటే ఎక్కువగానే పెరుగుతాయని అంటున్నారు నిపుణులు. అంటే దీర్ఘ కాలిక ప్రయోజనాలను ఆశించేవారు పెట్టుబడి పెట్టొచ్చు. బంగారం ధర 7 నెలల్లో 13వేల రూపాయల దాకా తగ్గింది. ఇంకా తగ్గినా.. అది స్వల్పంగానే ఉంటుంది తప్ప.. ఇప్పుడు తగ్గినట్లుగా భారీగా ఉండదు. పెరగడం మొదలైనా.. గతేడాది మాదిరిగా ఏడు నెలల్లోనే 13వేల రూపాయలు పెరిగే అవకాశం కూడా లేదు. ఆభరణాలుగా కొనుక్కున్నా.. పెట్టుబడిగా దగ్గర ఉంచుకోవాలనుకున్నా..ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చు. మరో నెల రోజుల పాటు ధరలు కాస్త అటు ఇటుగా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

Read also : Vizag Steel : విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ తధ్యం, రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదు, వందశాతం పెట్టుబడులు వెనక్కి : మళ్లీ చెప్పిన కేంద్రం