Gold: 2026లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..? అసలు నిజాలు ఇవే..
బంగారం.. భారతీయులకు ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. 2025లో పసిడి చూపిన విశ్వరూపం చూసి ప్రపంచం విస్తుపోయింది. అయితే ఇప్పుడు అందరి కళ్లు 2026 పైనే ఉన్నాయి. గతేడాది రికార్డులను తిరగరాసిన బంగారం, ఈ ఏడాది ఏ తీరానికి చేరబోతోంది? నిపుణులు ఏమంటున్నారు..?అనేది తెలుసుకుందాం.

2025లో కనివినీ ఎరుగని రీతిలో దూసుకుపోయిన బంగారం ధరలు 2026లో ఏ తీరానికి చేరబోతున్నాయి? పసిడి పరుగు కొనసాగుతుందా లేక బ్రేకులు పడతాయా? ప్రస్తుతం గ్లోబల్ బులియన్ మార్కెట్‌లో ఇదే హాట్ టాపిక్. అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకులు, ఆర్థిక విశ్లేషకులు విడుదల చేసిన తాజా నివేదికలు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు, మరికొన్ని సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
రికార్డుల వేటలో పసిడి: 5వేల డాలర్ల లక్ష్యం
2026 ప్రారంభంలోనే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4,630 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. పారిశ్రామిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో 2026 మధ్య నాటికి బంగారం ధర ఏకంగా 5,000 డాలర్ల మార్కును చేరుకోవచ్చని ANZ విశ్లేషకులు భావిస్తున్నారు.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో డాలర్‌పై ఆధారపడటం తగ్గించి, బంగారాన్ని ఒక రక్షణ కవచంలా పోగు చేసుకుంటున్నాయి.
వడ్డీ రేట్ల ప్రభావం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే పెట్టుబడిదారులు వడ్డీ లేని ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇది సహజంగానే ధరను పెంచుతుంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు, సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
ETFలపై ఆసక్తి: సంస్థాగత పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో భారీగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్‌కు బలమైన మద్దతునిస్తోంది.
హెచ్చరికలు: ధరలు తగ్గే అవకాశం ఉందా?
ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు, కొంతమంది విశ్లేషకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరాయి కాబట్టి, లాభాల స్వీకరణ వల్ల ధరల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. ఒకవేళ యూఎస్ ఫెడ్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచితే పసిడిపై ఒత్తిడి పెరిగి ధరలు 4,400 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం కూడా ఉంది.
మొత్తంమీద 2026లో బంగారం ధరలు 4,400 డాలర్ల నుండి 4,900 డాలర్ల పరిధిలో ఊగిసలాడవచ్చునని మెజారిటీ విశ్లేషకుల అంచనా. స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఇప్పటికీ సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
