
మన దేశంలో బంగారం కొనుగోలు ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా భావిస్తారు. అయితే బంగారం నాణ్యతపై సరైన అవగాహన లేకపోతే వినియోగదారులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం బంగారం ప్రధానంగా క్యారెట్ (Karat) ఆధారంగా విభజించబడుతుంది. అధిక నాణ్యత గల బంగారం 24 కేరట్లు (24K)గా పరిగణించబడుతుంది. ఇందులో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉండటం వల్ల నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించరు. అందువల్ల 22K (91.6 శాతం స్వచ్ఛత) బంగారం నగల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 18K (75 శాతం స్వచ్ఛత), 14K వంటి బంగారం రకాలు ప్రధానంగా డైమండ్ జ్యువెలరీ, డిజైనర్ ఆభరణాల్లో ఉపయోగిస్తారు. కేరట్ సంఖ్య తగ్గే కొద్దీ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరుగుతుంది.
బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్ తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (BIS) హాల్‌మార్క్ నాణ్యతకు గుర్తుగా పరిగణించబడుతుంది. దీనిలో BIS లోగో, కేరట్ వివరాలు, జ్యువెలర్ గుర్తింపు నంబర్ వంటి వివరాలు ఉంటాయి. ఇక బంగారం ధరలను కొనుగోలు చేసే రోజున మార్కెట్ రేట్లతో సరిపోల్చుకోవడం కూడా అవసరం. మేకింగ్ చార్జీలు దుకాణం వారీగా మారుతాయి కాబట్టి ముందుగా అవి తెలుసుకోవడం మంచిది. బిల్లుతో కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎక్స్చేంజ్ లేదా రీసేల్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
మరొక ముఖ్య అంశం.. రత్నాలు లేదా డైమండ్లు ఉన్న నగలు కొనుగోలు చేసే సమయంలో బంగారం బరువు, రత్నాల బరువును వేర్వేరుగా లెక్కించాలి. లేకపోతే అధిక ధర చెల్లించే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా బంగారం కొనుగోలులో నాణ్యత, ధృవీకరణ, ధర వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే వినియోగదారులు సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి