
సాధారణంగానే అందరూ పసిడి ప్రియులే.. ఆడ మగ అనే తేడా లేదు.. బంగారం ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతేకాదు భారతదేశంలో బంగారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలకు బంగారం కొనడం తప్పనిసరి అయిపోయింది. కానీ, బంగారం ధర మాత్రం ముట్టుకోకుండానే షాక్ కొట్టేలా రోజురోజుకూ కొత్త గరిష్టాలను చేరుకుంటోంది. అయితే, బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల మేరకు బంగారం కొనడం వల్ల నష్టాల కంటే లాభమే ఎక్కువగా ఉంటుందిన చెబుతున్నారు.. డబ్బు వృధా చేసే ముందు ఈ రహస్యం తెలుసుకోండి.
బంగారం ధర దాని మార్కెట్ విలువపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది ఆభరణాల తయారీ సమయంలో ఎంత నష్టం జరుగుతుందో, ఆఖరుకు మన నగ చేతికి వచ్చే సమయానికి బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో దానిని బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఆభరణాలు మన్నికగా ఉండటానికి నగల వ్యాపారులు రాగి, జింక్, వెండి వంటి లోహాలను యాడ్ చేస్తారు. లోహం పరిమాణం ఎక్కువగా ఉంటే, దాని స్వచ్ఛత కూడా తగ్గుతుంది. దాని డిజైన్, అందులో పొదిగిన రత్నాలను బట్టి మేకింగ్ ఛార్జీలను వసూలు చేస్తారు. చివరకు మనకు వచ్చే నగలో 22-క్యారెట్ లేదా 18-క్యారెట్ బంగారం లభిస్తుంది. ఆఖరుకు ఆ బంగారు ఆభరణం పై జీఎస్టీ కూడా చెల్లించాలి.
స్వర్ణకారుడి ప్రకారం 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ప్రతి పది గ్రాముల ఆభరణాలకు, దాదాపు ఒక గ్రాము బంగారం సేధారం అని అంటారు. అంటే మీరు 10 గ్రాముల విలువైన బంగారు గొలుసును కొనుగోలు చేస్తుంటే, మీరు మొత్తం 11 గ్రాముల బంగారానికి చెల్లిస్తారు. బంగారు ఆభరణాల ప్రాసెసింగ్ రుసుమును కస్టమర్ నుండి వసూలు చేస్తారు. అందుకే బంగారు ఆభరణాల ధర నాణేలు, బిస్కెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్ని కలుపుకుని కొత్త బంగారు ఆభరణాలు కొన్నప్పుడు అదనపు ఛార్జీలు అన్ని కలిపి ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ అమ్మినప్పుడు మాత్రం అలా కాదు.
చాలా చోట్ల, బంగారాన్ని ఇప్పటికీ కరిగించి తూకం వేస్తారు. 24 క్యారెట్ల బంగారంగా మార్చినప్పుడు ఒక గ్రాము పోతుంది. కరిగించేటప్పుడు అందులో కలిపిన లోహాలు ఆవిరైపోతాయి. దీని కారణంగా మనకు లభించే తుది బంగారు నగల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది లాభం కంటే నష్టమే ఎక్కువ. కానీ, తప్పదు. అందుకే, మీరు బంగారు ఆభరణాలను పెట్టుబడి రూపంలో కొనాలనుకుంటే నాణాలు, కడ్డీల రూపంలో కొంటేనే మంచిది. ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి