
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్ 2025లో తన సత్తాను చాటి 2026లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. గత వారంలో సెన్సెక్స్ 0.89 శాతం వృద్ధితో 85,762 పాయింట్ల వద్ద స్థిరపడగా, అటు కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు షాకిస్తూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.
గడిచిన వారం రోజుల్లోనే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేవలం వారం వ్యవధిలో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.750, 22 క్యారెట్ల బంగారంపై రూ.760 మేర ధరలు పెరగడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ నుండి లభిస్తున్న బలమైన మద్దతు. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,392 డాలర్ల వద్ద సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. 2025 సంవత్సరంలోనే బంగారం 73 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా 2026లోనూ ఈ బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పసిడితో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. గత వారంలోనే కిలో వెండి ధర సుమారు రూ.3,100 పెరిగి, ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,41,000 మార్కును చేరుకుంది. విశేషమేమిటంటే.. ఈ సంవత్సరంలో వెండి ఏకంగా 160 శాతానికి పైగా పెరిగి బంగారం కంటే మెరుగైన రిటర్న్స్‌ను అందించింది.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఉన్నప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అయితే ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల సామాన్య వినియోగదారులపై భారం పడుతోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి