
ఇటీవలి రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కానీ, పెట్టుబడిదారులు మాత్రం ఇదే అదునుగా పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు మరింతగా ఆకాశన్నంటుతున్నాయి. వెండి, గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో మీరు సరైన పెట్టుబడి పద్ధతిని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో పెద్ద లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన పద్ధతిలో చేస్తే మీరు ఆదా చేసుకున్న డబ్బుపై ఊహించనంత లాభం పొందుతారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారు ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లను ఎంచుకుంటారు. కానీ, ఇటీవల నిపుణులు బంగారం, వెండి ETFలు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) మెరుగైన, సులభమైన పెట్టుబడి ఎంపిక అని సూచిస్తున్నారు. ETFల ప్రధాన ప్రయోజనాలు తక్కువ ధర, సులభంగా కొనుగోలు చేయడం, అమ్మడం లేదంటే, నిల్వ చేయడంలో ఇబ్బంది లేకపోవడం.
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మెకింగ్ చార్జీలు పెద్ద భారంగా మారుతుంది. అలాగే, అమ్మేయాలనుకుంటే.. మనం పెట్టిన పెట్టుబడి పూర్తిగా తిరిగి రాదు. దీని వలన ఆభరణాలు లాభదాయకమైన పెట్టుబడి కాదని నిపుణులు అంటున్నారు.
ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు బంగారం ధర 82 శాతం, వెండి ధర 175 శాతం పెరిగింది. జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 76,772 ఉండగా, డిసెంబర్ 26న రూ. 1,39,890కి చేరుకుంది. అదేవిధంగా, వెండి ధర కిలోకు రూ. 87,300 నుంచి రూ. 2,40,300కి పెరిగింది. ETFల ద్వారా పెట్టుబడి పెట్టడం వలన మీరు తీసుకున్న గోల్డ్ క్యారెట్ స్వచ్ఛత, తక్కువ కొనుగోలు చార్జీలు, అధిక ద్రవ్యత లభిస్తాయి. డీమ్యాట్ ఖాతా ద్వారా స్టాక్‌ల మాదిరిగానే ETFలను కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు, అవసరమైనప్పుడు నిధులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్ కూడా ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ఇది సెబీ నియంత్రణలో ఉన్న ఉత్పత్తి కానందున కొన్ని నష్టాలు ఉన్నాయి. అందువల్ల, సెబీ నియంత్రణలో ఉన్న బంగారం, వెండి ఇటిఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..