Telugu News Business Going by car to snowy areas, Failure to take these precautions is dangerous, Winter driving tips details in telugu
Winter driving tips: మంచు ప్రాంతాలకు కారులో వెళుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే
దేశంలో మధ్య తరగతి ప్రజలకు కూడా కార్లు అందుబాటులోకి వచ్చాయి. వారి ఆదాయాలకు అనుగుణంగా వివిధ కంపెనీలు వీటిని విడుదల చేస్తున్నాయి. అందుబాటు ధరలో ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కారును కొనుగోలు చేసిన వెంటనే విహారయాత్రలు చేయడం సర్వసాధారణం. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు పర్యటనలు చేస్తారు. అయితే కారు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల మనాలిలో మంచు రోడ్లపై జారిపోతున్న కార్ల వీడియోలు వైరల్ అయ్యాయి. మంచు ప్రాంతాలకు కార్లపై వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా శీతాకాలంలో మంచు ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. అక్కడి మంచు కొండలు, లోయలు, వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. చెట్లు, కొండలు, ఇళ్లపై పేరుకుపోయిన మంచు కనువిందు చేస్తుంది. అదే సమయంలో రోడ్లపై కురిసిన మంచు కారణంగా కారు టైర్లు జారిపోతాయి. మనాలి తదితర ప్రాంతాల్లోని ఘాట్ రోడ్లపై ఏమాత్రం జారినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటి నివారణకు ఈ కింద తెలిపిన సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు పాటించాలి.
మంచుతో కూడిన రోడ్లపై ప్రయాణించేటప్పుడు కారు బ్రేకులను చాలా సున్నితంగా ఉపయోగించాలి. గట్టిగా నొక్కడం వల్ల టైర్ లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పడు టైరు జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బ్రేకులను చాలా సున్నితంగా వాడుతూ ముందు వెళుతున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి.
గాలితో గట్టిగా ఉంటే టైర్ల వల్ల జారిపోయే అవకాశం చాాలా ఎక్కువగా ఉంటుంది. మంచు కురిసిన రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు టైరు ఒత్తిని తగ్గించాలి. దీని వల్ల టైరు కాంటాక్ట్ ప్యాచ్ పెరుగుతుంది. గాలి తక్కువగా ఉంటే రోడ్డును టైరు పట్టుకునే అవకాశం కలుగుతుంది.
మంచుపై వెళుతున్నప్పడు ఇంజిన్ బ్రేకింగ్ ఉపయోగించడం చాాలా ఉత్తమం. వాహనం వేగాన్ని తగ్గించడానికి సాధారణ బ్రేకులతో పోల్చితే ఇవి చాాలా ప్రయోజనం కలిగిస్తాయి. డ్రైవర్ తక్కువ గేర్ లో వాహనాన్ని నడపాలి.
శీతాకాలపు టైర్లను వినియోగించడం చాలా మంచిది. ఇవి చల్లని వాతావరణ పరిస్థితుల్లో కారుకు మెరుగైన పట్టు, నియంత్రణను అందిస్తాయి. అలాగే బ్రేకింగ్ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. విదేశాల్లో చాలామంది తమ కార్లకు శీతాకాలపు టైర్లను వినియోగిస్తుంటారు.
మంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చైన్ టైర్లు కూడా కారుకు మంచి రక్షణను అందిస్తాయి. మంచు రోడ్లపై జారిపోకుండా పట్టు కలిగిస్తాయి. అలాగే బ్లాక్ ఐస్ ను బద్దలుకొట్టుకుంటూ ముందుకుసాగుతాయి. పర్వత ప్రాంతాలు, భారీ హిమపాతం కురిసే చోట ప్రయాణానికి ఇవి చాలా అనువుగా ఉంటాయి.