LPG Gas Cylinder: వంట గ్యాస్ ధరలు నెలనెలా పెరుగుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. వంట గ్యాస్ ధరల సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. గడిచిన 16 నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరను 13 సార్లు సవరించినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి రాజ్యసభకు తెలిపారు. మార్చి 2020 నుంచి ప్రభుత్వ ఎన్నిసార్లు వంట గ్యాస్ ధరను సవరించింది? ఎంత మొత్తం పెంచింది? అని వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. 2020 మార్చిలో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలెండర్ ధర 805 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 834 రూపాయలకు చేరినట్లు చెప్పారు.
దేశంలో పెట్రోలియం ఉత్పాదనల ధరలను అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది. సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేసే వంట గ్యాస్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరను మాత్రం అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 2019-20లో 23 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ రీఫిల్స్ విక్రయించగా 2020-21లో ఈ సంఖ్య 35 కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు.
ఇదిలా ఉండగా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఈ నెల ప్రారంభంలో రూ.73.50లు పెంచారు. దీంతో సిలిండర్ ధర రూ.1600 ఎగువునకు చేరింది.
Also Read..