బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..
Robert Kiyosaki: ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక చేశారు. రాబోయే గ్లోబల్ ట్రెండ్స్ వల్ల రాగి ధరలు ఆకాశాన్నంటబోతున్నాయని, మార్కెట్‌లో రాగి కొరత ఏర్పడే కాపర్ సిజర్స్ పరిస్థితి రాబోతుంది చెప్పారు. అసలు రాగికి అంత డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? స్మార్ట్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని మరో కీలకమైన లోహం వైపు మళ్లించారు. ఇప్పటివరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల గురించి మాట్లాడిన ఆయన.. ఈసారి రాగి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాగి మార్కెట్ బూమ్ కాబోతుందని, చాకచక్యంగా ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలోనే రాగి ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ, అసలు పెరుగుదల మున్ముందే ఉందనేది కియోసాకి విశ్లేషణ.
దీనికి ప్రధానంగా 3 రంగాలు కారణమవుతున్నాయి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – డేటా సెంటర్లు: AI టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో భారీ డేటా సెంటర్ల నిర్మాణం పెరుగుతోంది. వీటిలో విద్యుత్ ప్రసారానికి రాగి అత్యంత కీలకం.
ఎలక్ట్రిక్ వాహనాలు: సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలలో 3 నుంచి 4 రెట్లు ఎక్కువ రాగిని ఉపయోగిస్తారు.
గ్రీన్ ఎనర్జీ – పవర్ గ్రిడ్లు: సోలార్, విండ్, గ్లోబల్ పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు రాగి వినియోగం విపరీతంగా పెరిగింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 2.8 కోట్ల టన్నులుగా ఉన్న రాగి డిమాండ్.. 2040 నాటికి 4.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా.
సరఫరా సంక్షోభం – కాపర్ సిజర్స్ ప్రభావం
ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు ప్రపంచ మార్కెట్‌లో రాగి లభ్యత క్రమంగా తగ్గిపోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన చిలీ దేశంలో గనుల ఉత్పత్తి దాదాపు 9.5శాతం పడిపోయింది. గత రెండు దశాబ్దాలుగా మైనింగ్ గనుల్లో లభించే రాగి ఖనిజ నాణ్యత తగ్గిపోయింది. ఫలితంగా గతంలో లభించినంత రాగిని వెలికితీసేందుకు ఇప్పుడు 20శాతం అదనంగా గనులను తవ్వాల్సి వస్తోంది. డిమాండ్ విపరీతంగా పెరగడం, అదే సమయంలో సరఫరా పడిపోవడాన్ని కియోసాకి కాపర్ సిజర్స్‌గా అభివర్ణించారు. ఈ కత్తెర కత్తిరింపు ధోరణి వల్ల రాగి ధరలు భవిష్యత్తులో మరింత మండే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లకు కియోసాకి ఇచ్చిన కీలక సూచనలు..
సాంప్రదాయ పొదుపు సరిపోదు: బ్యాంకులు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి పాతపద్ధతి పొదుపు మార్గాలకే పరిమితమైతే ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ: ‘‘ఏ ఒక్క మైనింగ్ కంపెనీ గెలుస్తుందో ఊహించడం కంటే.. మారుతున్న ఈ గ్లోబల్ ట్రెండ్స్ వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా లాభపడే రంగాలు, సంస్థల పై దృష్టి పెట్టడమే ఉత్తమం’’ అని తన రిచ్ డాడ్ నేర్పిన పాఠాన్ని ఆయన గుర్తుచేశారు.
