Forbes Billionaires 2022: ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో టాప్- 3 వారే.. ఇండియాలో రికార్డు స్థాయిలో పెరిగిన సంపన్నులు..
Forbes Billionaires 2022: భారత్‌లోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ బిలియనీర్ల జాబితాలో గత సంవత్సరం వారే మెుదటి మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. కానీ.. కొత్తగా చాలా మంది సంపన్నలు వచ్చి చేరారు.
Forbes Billionaires 2022: భారత్‌లోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) అగ్రస్థానంలో నిలవగా.. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ(Gowtham Adani) రెెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ నాడార్ నిలిచారు. ఫోర్బ్స్ 2022 జాబితాలో మొదటి మూడు స్ఠానాల విషయంలో ఎలాంటి మార్పులేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ముకేశ్ అంబానీ సంపద గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెంది.. 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తిగా కాకుండా ప్రపంచంలోని పదవ సంపన్నుడిగా రిలయన్స్ అధినేత రికార్డు సృష్టించారు.
ఫోర్బ్స్ జాబితాలో అంబానీ తర్వాతి స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ సంపద విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన ఆసియాలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా 24.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో నాల్గవ స్థానంలో నిలిచారు. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ 20 బిలియన్ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో నిలిచారు. కాగా గత ఏడాది ప్రపంచంలోని 100 మంది సంపన్నుల జాబితాలోకి రాధాకిషన్ ప్రవేశించారు.
స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ నికర విలువ 17.9 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో.. జిందాల్ గ్రూప్ మాతృక సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఏడో స్థానంలో, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ బిర్లా 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎనిమిదో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ షాంఘ్వీ 15.6 బిలియన్ డాలర్ల నికర విలువతో తొమ్మిదో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ 14 బిలియన్ డాలర్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు. ఇక భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గతేడాది 140గా ఉండగా.. ఇప్పుడు రికార్డు స్థాయిలో 166కు చేరుకుందని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు దాదాపు 15.6 బిలియన్ డాలర్లను సమీకరించాయని ఫోర్బ్స్ తెలియజేసింది.
ఇవీ చదవండి..
Elon Musk: ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా ఎలాన్ మస్క్..! అసలు మ్యాటర్ ఏమిటంటే..
Loan Fraud: లోన్ మోసాలపై ఇలా జాగ్రత్త పడండి.. లేకుంటే వారిలా ఇబ్బందిపడతారు..