దేశంలోని పలు టెక్ కంపెనీలు యువ నిపుణుల (ఫ్రెషర్లు) నియామకానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. పెరుగుతున్న సాంకేతిక అవసరాల నేపథ్యంలో ఈ ట్రెండ్ ఊపందుకుంది. దాదాపు 74 శాతం కంపెనీలు ఇదే విధానం అనుసరిస్తున్నాయి. దీనివల్ల చదువుకున్న పూర్తయిన వెంటనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తద్వారా జీవితంలో స్థిరపడటానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇటీవల విడుదలైన ఓ సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని పలు కంపెనీలలో యువ నిపుణుల నియామకాలు జోరుగా జరుగుతున్నాయి. దాదాపు 74 శాతం కంపెనీల యజమానులు వీరిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏటా ఈ నియామకాల శాతం పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ సారి నాలుగు శాతం పెరిగింది. ఇ-కామర్స్, రిటైల్, ఇంజినీరింగ్ తదితర రంగాలలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు మంచి అవకాశాలు పెరిగాయి.
పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వివిధ నైపుణ్యాల కలిగిన ఉద్యోగుల అవసరాలు కంపెనీలకు పెరిగాయి. వాటికి అనుగుణంగా నిపుణులను నియమించుకునేందుకు వివిధ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. దీంతో కళాశాల నుంచి బయటకు వచ్చే యువతకు స్వాగతం పలుకుతున్నాయి, బెంగళూరు, ముంబై, చెన్నై తదితర నగరాల్లో ఈ వరుసలో ముందున్నాయి. స్టాక్ డెవలప్ మెంట్, ఎస్ఈవో నైపుణ్యం, డిజిటల్ సేల్స్ తదితర ఆదునిక డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారికి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. యువ నిపుణులకు ఉద్యోగాలు కల్పించే వాటిలో ఇ-కామర్స్ సంస్థలు, టెక్ స్టార్టప్ లు ముందున్నాయి. ఈ రంగాలకు సంబంధించిన దాదాపు 62 శాతం యజమానులు తమ కంపెనీలలో ఫ్రెషర్ల కు అవకాశాలు కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్, రిటైల్ రంగాల్లో కూడా యువతకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో దాదాపు 54 శాతం యజమానులు.. యువ నిపుణుల కోసం ఎదురు చూస్తున్నారు.
టెక్ రాజధానిగా భావించే బెంగళూరులో 74 శాతం కంపెనీలు ఫ్రెషర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముంబైలోని 60 శాతం ఆర్థిక, కార్పొరేట్ దిగ్గజాలు ఈ దారిలోనే నడుస్తున్నాయి. చెన్నైలోని పారిశ్రామిక కంపెనీలలో 54 శాతం కొత్తవారి కోస ఎదురు చూస్తున్నాయి. కంపెనీలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల అవసరాల పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుల్ స్టాక్ డెవలపర్లు, ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్ లు, డిజిటల్ సేల్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలకు పూణె, బెంగళూరు, ముంబై నగరాల్లో డిమాండ్ ఉంది. పనిలో అనుభవం ఉన్నవారి కంటే డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న నైపుణ్యాలు కలిగిన వారికి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. దేశంలో వచ్చిన కొత్త ట్రెండ్ యువతలో విశ్వాసం నింపుతోంది. చదువుకున్న వెంటనే ఉద్యోగం లభిస్తుందన్న భరోసా వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతోంది. బాగా చదువుకోవాలన్న ఆసక్తితో పాటు నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి