Agriculture: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయంలో రెండేళ్లపాటు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్18న ఆమోదం తెలిపింది. ఇప్పుడు కర్నాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ తయారీ కంపెనీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి డ్రోన్ల వినియోగం, సాధ్యాసాధ్యాలపై పనిచేస్తు్న్నాయి. డ్రోన్‌ల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అందించే 100 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా సామర్థ్యం, ఉత్పత్తిని మెరుగుపరచాలని భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో ఎరువులు పిచికారీ చేయడానికి ఉపయోగించే డ్రోన్‌ల పరీక్ష ఇప్పటికే పూర్తయింది. ఈ రాష్ట్రాల్లోని రైతు ఉత్పత్తి సంస్థలు అతి త్వరలో డ్రోన్‌లను ఉపయోగించడం ప్రారంభిస్తాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
రైతుల కోసం ఉపయోగించే డ్రోన్‌ల కోసం చాలా రాష్ట్రాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. డ్రోన్లని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని రైతులకి తక్కువ రుసుముతో అద్దెకి ఇస్తాయి. దాదాపు 10 కిలోల ఎరువులని మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్‌లకి ఎకరాకు రూ.350 నుంచి 450 రూపాయలకు అద్దెకు ఇస్తారు. బహుళ బ్యాటరీలతో కూడిన డ్రోన్‌ను రోజుకు కనీసం ఆరు గంటల పాటు వినియోగిస్తే 30 ఎకరాల వ్యవసాయ భూమిని కవర్ చేస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ల కొనుగోలు కోసం వ్యవసాయ సంస్థలకు 100 శాతం గ్రాంట్‌ను జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్రోన్‌లను ఉపయోగించి పురుగుమందుల పిచికారీ చేయడం వల్ల పంటలని కాపాడటమే కాకుండా తక్కువ జీవన వ్యయంతో రైతుల ఆదాయాన్ని కూడా పెంచవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి