Electric Tractor: కార్లు, టూ వీలర్లు, త్రీ వీలర్లు, బస్సులు, మినీ ట్రక్కుల తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కూడా వస్తోంది. త్వరలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ని విడుదల చేయనున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీనివల్ల రైతులకు ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించే ఖర్చు తగ్గడంతో పాటు దున్నేందుకు ఖర్చు కూడా తక్కువ అవుతుందని తెలిపారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను విడుదల చేస్తున్న కంపెనీ పేరు చెప్పడానికి మంత్రి నిరాకరించారు. లాంచ్ తేదీలు, ఫార్మాలిటీలు జరుగుతున్నాయని అన్నారు. గడ్కరీ గత వారం HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ EV సమ్మిట్‌లో మాట్లాడుతూ “ఒక రైతు 300 కిలోల కూరగాయలను మార్కెట్‌కు రవాణా చేయాలి అతను రూ. 200 ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో నేను ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాను” అని చెప్పారు.
ఇప్పటివరకు సోనాలికా మాత్రమే..
దేశంలోని అనేక ప్రాంతాల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 100 దాటడంతో గత కొన్ని నెలలుగా వ్యవసాయ ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లు, వాటి అత్యంత పొదుపు ధరతో, సంప్రదాయ డీజిల్‌తో నడిచే ట్రాక్టర్‌లకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. పంజాబ్‌కు చెందిన సోనాలికా ట్రాక్టర్స్ భారతదేశంలో వాణిజ్యపరంగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన ఏకైక ట్రాక్టర్ కంపెనీ. టైగర్ ఎలక్ట్రిక్ అని పిలువబడే సోనాలికా దీనిని డిసెంబర్ 2020లో రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది. 11kW మోటార్ ద్వారా ఆధారితం, 500kg లిఫ్ట్ సామర్థ్యంతో టైగర్ ఎలక్ట్రిక్ స్ప్రింక్లింగ్, మోవింగ్, రోటవేటర్, ట్రాలీని మోసుకెళ్లడం వంటి అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నారు.