Electric cars: 2024లో ఎలక్ట్రిక్ కిక్.. కార్ల మార్కెట్‌ను ఊపేసిన అమ్మకాలు

|

Jan 08, 2025 | 4:30 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలోని స్కూటర్లు, బైక్ లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదే కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వం ప్రోత్సాహం తదితర కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయి. మన దేశంలో ఎక్కడా చూసినా ఈవీలు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో 2024 చివరి నాటికి 20 శాతం పెరుగుదల నమోదైంది.

Electric cars: 2024లో ఎలక్ట్రిక్ కిక్.. కార్ల మార్కెట్‌ను ఊపేసిన అమ్మకాలు
Ev Cars
Follow us on

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గతేడాది 40.7 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. వాటిలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.4 శాతంగా ఉంది. వీటి వాటా 2023లో 2.1 శాతం మాత్రమే కావడం విశేషం. ఈ లెక్కల ప్రకారం గణనీయమైన పురోగతి లేనప్పటికీ ఆ మాత్రం పెరగడం విశేషమనే చెప్పవచ్చు. ఎందుకంటే గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయాయి. ఓ ప్రముఖ కంపెనీ వాహనాలతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కస్టమర్లు తమ బాధలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సవాళ్లను ఈవీ మార్కెట్ అధిగమించిందనే చెప్పవచ్చు. ఒకటి, రెండు వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదురైనా మిగిలిన వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందాయి. తద్వారా ఈ విభాగంలో వాహనాల అమ్మకాలు బాగున్నాయి. టాటా మోటార్స్ 2024లో 61,496 యూనిట్లను ఈవీలను విక్రయించి మార్కెట్ లో అగ్రగామిగా నిలిచింది. టాటా టియాగో హచ్, టిగోర్ సెడాన్, పంచ్ మినీ ఎస్ యూవీ, నెక్సాన్, కర్వ్ ఎస్ యూవీలను కలిగి ఉన్న ఐసీఈ మోడళ్ల ఎలక్ట్రిక్ వెర్షన్లను విక్రయిస్తోంది. కొత్త ఏడాదిలో మరిన్ని మోడళ్లకు విడుదల చేయనుంది.

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటారు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ 2024లో దాదాపు 125 శాతం ప్రగతిని సాధించింది. 2023లో 9,526 యూనిట్లను విక్రయించగా, 2024లో వాటి సంఖ్య 21,484కు పెరిగింది. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్, బ్యాటరీ రెంటల్ మోడల్ తో వచ్చిన విండర్స్ ఎస్ యూవీకి కస్టమర్ల ఆదరణ లభించింది. ప్రముఖ కంపెనీలైన మారుతీ సుజుకి, హ్యుందాయ్ నుంచి 2025లో కొత్త మోడళ్లు విడుదల కానున్నట్టు సమాచారం. వాటి ద్వారా మార్కెట్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ ఇవిటా, హ్యుందాయ్ నుంచి క్రెట్ ఎస్ యూవీ ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి. మహింద్రా అండ్ మహింద్రా కూడా తన బీఈ6, ఎక్స్ ఈవీ 9ఈ కార్లను ఆవిష్కరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి