సీనియర్ సిటిజన్లు ఎఫ్ డీ వేస్తున్నారంటేనే వారు జీవితాంతం కష్టపడిన డబ్బు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని దాచుకునే భరోసా. అయితే అలాంటి వారు ఆశగా చూసేది వడ్డీ రేట్. ఏ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ ఇస్తుందో తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీలో రెపో రేట్లను 0.35 శాతం నుంచి 6.25 శాతం వరకూ పెంచింది. దీంతో అన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను తప్పనిసరిగా పెంచుతున్నాయి. బ్యాంక్ ను బట్టి 0.5 నుంచి 0.75 బేసిక్ పాయింట్ల వరకూ పెరిగింది. ఈ నేపథ్యంలో టాప్ బ్యాంక్స్ ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, పీఎన్ బీ, కెనరా సహా అనేక బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. అవి ఏ రేంజ్ లో ఉన్నాయో? తెలుసుకుందాం.
ఎస్ బీఐ తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ను ఇటీవల 65 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల మధ్య కాలానికి 3.50 శాతం నుంచి 7.25 మధ్య వడ్డీ రేట్ ను ఆఫర్ చేస్తుంది.
ఈ బ్యాంక్ రెండు కోట్ల రూపాయల లోపు వరకూ వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. పెరుగుదల తర్వాత సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలాని 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకూ ఉంది. ఈ వడ్డీ రేట్ డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.రెండు కోట్ల లోపు ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపును ఆఫర్ చేస్తుంది. ఇటీవల ఈ బ్యాంక్ ఎఫ్ డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దీంతో ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్ 3.5 శాతం నుంచి 7.50 శాతం వరకూ ఉంది. ఈ ఆదేశాలు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయి.
పీఎన్ బీ వెబ్ సైట్ ప్రకారం రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్ డీలపై 50 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లకు అందించే వడ్డీ రేట్ 4 శాతం నుంచి 7. 75 శాతం వరకూ ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ కూడా తన బ్యాంకులో రూ. 2 కోట్ల రూపాయల లోపు ఉన్న ఎఫ్ డీలపై వడ్డ రేట్ ను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ పెంపు డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వస్తాయి. ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల 3.25 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేట్ ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..