Own Business: ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? ఆ బీమాతో ఎంతో ధీమా

|

Jan 01, 2025 | 4:45 PM

సొంతంగా వ్యాపారం చేయాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చాలామంది కలలు కంటారు. తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని ఆశ పడతారు. మంచి ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం సంపాదిస్తున్నా కొందరి ఆలోచన ఎప్పుడూ సొంత వ్యాపారంపైనే ఉంటుంది. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకుని, సొంత వ్యాపారాలు చేస్తున్న వారి గురించి తరచూ వింటూనే ఉంటాం.

Own Business: ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? ఆ బీమాతో ఎంతో ధీమా
Business Idea
Follow us on

మంచి కంపెనీలో చేస్తున్నఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి దిగాలనుకోవడం సాహసమనే చెప్పవచ్చు. అయితే క్రమశిక్షణ, పట్టుదలలో ఈ రంగంలో విజయం సాధించినవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారు ఈ కింద తెలిపిన ప్రాథమిక ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో బీమా అనేది అందరికీ అండగా ఉంటుంది.  ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాలి. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకూ మీ ఖర్చులన్నింటినీ కవర్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించగానే లాభాలు రావు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మీ దగ్గర తగినంత పొదుపు అవసరం.

ఆదాయం పెంపు

వ్యాపారాన్ని ప్రారంభించిన వెంటనే ఆదాయం ఒక్కసారిగా రాదు. మీకు వచ్చే లాభాలలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఈ ఒత్తిడిని అధిగమించడానికి సరైన ఆదాయ ప్రణాళికను ఎంచుకోవాలి. పాలసీ మొదటి సంవత్సరం ముగియగానే చెల్లించడం ప్రారంభించే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే అదనపు ఆదాయం లాభదాయమైన వ్యాపారాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది.

కుటుంబానికి భద్రత

వ్యాపార రంగం ఎప్పుడూ ఒడిదొడుకులకు గురవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆర్థికంగా ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో అవస్థలు పడేలా చేస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగంలో ఉండగానే జీవిత బీమా తీసుకోవాలి. అకాల మరణం సంభవించినా, అంగవైకల్యానికి గురైనా మీ కుటుంబానికి బీమా అండగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య బీమా

కంపెనీలో ఉద్యోగిగా ఉన్నప్పుడు మీకు మెడిక్లెయిమ్ తదితర ఆరోగ్య బీమా కవర్ అవుతుంది. ఉద్యోగం మానేయ్యగానే వాటిని కోల్పోతారు. ఈ రోజుల్లో యుక్త వయసులోనే అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రి బిల్లులు లక్షల్లో ఖర్చవుతున్నాయి. కాబట్టి ఉద్యోగం మానేయ్యగానే ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలి.

కుటుంబ సభ్యుల కోసం

పిల్లల చదువులకు, పెద్ద వారైన తల్లిదండ్రుల అవసరాలకు నిర్మాణాత్మక ప్రణాళిక అవసరం. వాటికి అవసరమైన నిధులు మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. వ్యాపారం ప్రారంభించగానే మొదటి నెల నుంచి వీటికి సొమ్ములను కేటాయించడం కుదరదు. కాబట్టి కుటుంబ అవసరాలను కోసం తగినంత సొమ్మును పక్కన పెట్టుకోవాలి.

ఉద్యోగ విరమణ ప్రణాళిక

వ్యాపారంలో ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాత మీ దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఎందుకుంటే మీరు ఉద్యోగం నుంచి వ్యాపారానికి రాగానే పీఎఫ్ తదితర పథకాలు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ ప్లాన్లు, పెట్టుబడి పథకాలు తదితర వాటిని అన్వేషించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి