యాక్సిడెంట్‌ గురించి లేట్‌గా ఇన్ఫామ్‌ చేస్తే.. ఇన్సూరెన్స్‌ రాదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

వాహన ప్రమాదం తర్వాత 68 రోజుల ఆలస్యంగా దాఖలైన బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైనా, ఒడిశాకు చెందిన దేబానంద ప్రుస్టీ కేసులో అంబుడ్స్‌మన్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సరైన కారణం ఉంటే ఆలస్యం కారణంగానే క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించరాదని ఈ తీర్పు స్పష్టం చేసింది.

యాక్సిడెంట్‌ గురించి లేట్‌గా ఇన్ఫామ్‌ చేస్తే.. ఇన్సూరెన్స్‌ రాదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?
Accident Claim

Updated on: May 11, 2026 | 9:00 AM

వాహన ప్రమాదం జరిగిన తర్వాత బీమా క్లెయిమ్‌ను ఆలస్యంగా నమోదు చేస్తే అది పూర్తిగా తిరస్కరించబడుతుందా? ఈ ప్రశ్నకు సంబంధించిన ఒక కీలక కేసు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఒడిశాకు చెందిన దేబానంద ప్రుస్టీ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన తర్వాత 68 రోజుల ఆలస్యంగా బీమా క్లెయిమ్ దాఖలు చేసినప్పటికీ, చివరకు ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు పాలసీదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రమాదంలో వాహనం సైలెన్సర్‌, ఛాంబర్ దెబ్బతినగా, మరమ్మతు ఖర్చు సుమారు రూ.17,500గా అంచనా వేశారు. అయితే ప్రుస్టీ కుమారుడు సెమిస్టర్ పరీక్షలతో బిజీగా ఉండటం వల్ల వెంటనే క్లెయిమ్ నమోదు చేయలేకపోయారని కుటుంబం తెలిపింది.

ప్రమాదం జరిగిన 68 రోజుల తర్వాత బీమా సంస్థకు సమాచారం ఇవ్వడంతో, వెంటనే సమాచారం ఇవ్వాలి అనే పాలసీ నిబంధన ఉల్లంఘించారని చెబుతూ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని ప్రుస్టీ ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్ ముందు సవాలు చేశారు. కేసును పరిశీలించిన అంబుడ్స్‌మన్, ఆలస్యానికి సరైన వివరణ ఉందని, అలాగే బీమా సంస్థ ఇప్పటికే నష్టాన్ని పరిశీలించి అంచనా వేసిందని పేర్కొంటూ క్లెయిమ్‌ను పరిష్కరించాలని ఆదేశించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం మోటార్ ఇన్సూరెన్స్‌లో ప్రమాదాన్ని సాధ్యమైనంత త్వరగా తెలియజేయడం చాలా ముఖ్యం. సాధారణంగా 24 నుంచి 72 గంటల మధ్య సమాచారం ఇవ్వడం పరిశ్రమలో అనధికారిక ప్రమాణంగా పరిగణిస్తారు. అయితే కేవలం ఆలస్యం కారణంగానే నిజమైన క్లెయిమ్‌ను తిరస్కరించడం సరైంది కాదని కోర్టులు, అంబుడ్స్‌మెన్‌లు పలుమార్లు స్పష్టం చేశాయి. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా నియంత్రణలో పనిచేస్తున్న బీమా వ్యవస్థలో, ఆలస్యంతో పాటు సాక్ష్యాలు దెబ్బతినడం, తనిఖీకి ముందే వాహనాన్ని మరమ్మతు చేయడం, లేదా ప్రమాదానికి సంబంధించిన వివరాల్లో పొంతన లేకపోవడం వంటి అంశాలే క్లెయిమ్‌లను బలహీనపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే ప్రమాదం చిన్నదైనా, వెంటనే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం, ఫోటోలు, వీడియోలు భద్రపరచడం, వాహనాన్ని తనిఖీ వరకు అలాగే ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. క్లెయిమ్ తిరస్కరణ జరిగితే, పాలసీదారులు ఫిర్యాదులను అంబుడ్స్‌మన్‌, వినియోగదారుల కోర్టులు లేదా IRDAI వేదికల ద్వారా సవాలు చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us