Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా..? మోసాల బారిన పడొద్దంటూ ఈ వార్త చదవండి..

క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ నగర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ మర్చెంట్ వెబ్‌సైట్లు, క్లోనింగ్, UPI–QR కోడ్ స్కాములు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, రివార్డ్ పాయింట్ మోసాలు వంటి పలు ఆధునిక పద్ధతులతో మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా..? మోసాల బారిన పడొద్దంటూ ఈ వార్త చదవండి..
Credit Card

Edited By:

Updated on: Dec 11, 2025 | 5:06 PM

క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ నగర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ మర్చెంట్ వెబ్‌సైట్లు, క్లోనింగ్, UPI–QR కోడ్ స్కాములు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, రివార్డ్ పాయింట్ మోసాలు వంటి పలు ఆధునిక పద్ధతులతో మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. తాజాగా బ్యాంక్ ఉద్యోగుల పేరుతో కాల్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచుతామని చెప్పడం, రీఫండ్ ఇస్తామని చెప్పి ఫేక్ యాప్‌లు డౌన్లోడ్ చేయమని ఒత్తిడి చేయడం, మార్కెట్‌లో నకిలీ APK యాప్స్‌ ద్వారా మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయించడం, అలాగే ఎటిఎంల వద్ద కార్డ్ స్కిమ్మింగ్ ద్వారా కార్డ్ సమాచారాన్ని చోరీ చేయడం వంటి కేసులు భారీగా నమోదవుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, SIM స్వాప్ మోసాలు పెరిగి బాధితుల మొబైల్ నంబర్లను హ్యాక్ చేసుకుని OTPలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్న సంఘటనలు కూడా నమోదవుతున్నాయని హెచ్చరించారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ అధికారులు సూచించారు. కార్డ్‌కు సంబంధించి ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సంబంధిత బ్యాంక్ అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి కార్డును బ్లాక్ చేయాలని, ఇంటర్నెట్‌లో కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను నమ్మి కాల్ చేయకూడదని స్పష్టం చేశారు.

OTP, PIN, CVV, కార్డ్ నంబర్ వంటి కీలక వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని, బ్యాంకులు కూడా ఈ వివరాలు ఎప్పుడూ అడగవని ప్రజలకు అవగాహన కల్పించారు. రీఫండ్ ఇస్తామని లేదా ట్రాన్సాక్షన్ సరిచేస్తామని చెప్పి యాప్ డౌన్‌లోడ్ చేయమని ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేయాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని అధికారులు సూచించారు.

అకౌంట్ స్టేట్మెంట్లను తరచూ చెక్ చేసి అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే డిస్ప్యూట్ రైజ్ చేయాలని, SIM స్వాప్ అనుమానం ఉన్నప్పుడు మొబైల్ ఆపరేటర్‌ను సంప్రదించి వెంటనే సిమ్ బ్లాక్ చేయించుకోవాలని సూచించారు.

మోసానికి గురైనవారు ఆలస్యం చేయకుండా 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. తాజా సైబర్ భద్రతా సమాచారం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వాలని సిటీ పోలీస్ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..