బంగారం, వెండి వదిలేయండి.. వీటిలో పెట్టుబడి పెడితే మీ దశ తిరిగినట్టే!
ప్రపంచ అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు బంగారం, వెండి బదులు రాగి, అల్యూమినియం వంటి బేస్ మెటల్స్ వైపు మళ్ళుతున్నారు. డిమాండ్ పెరుగుదల, సరఫరా సమస్యలు, చైనా నిబంధనలు, బలహీనమైన డాలర్ కారణంగా ఈ లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. రాగి, అల్యూమినియం MCXలో కీలక స్థాయిలను అధిగమించి, పెట్టుబడికి ఆకర్షణీయంగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి సమయంలో సాధారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈసారి మార్కెట్ ట్రెండ్ భిన్నంగా మారింది. బంగారం, వెండి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఇప్పుడు రాగి, అల్యూమినియం వంటి బేస్ మెటల్స్‌పై పెట్టుబడిదారుల దృష్టి పడింది. ఇటీవలి కాలంలో ఈ లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం గత నెలలో రాగి ధరలు సుమారు 9 శాతం పెరగగా, అల్యూమినియం ధరలు దాదాపు 7.5 శాతం వరకు పెరిగాయి. ఇది పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల నుండి పారిశ్రామిక లోహాల వైపు మళ్లుతున్నారనే సంకేతంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం MCX కాపర్ ధర సుమారు 1280 వద్ద ట్రేడ్ అవుతోంది. చైనా నుండి రాగి ఖనిజ దిగుమతులు 6.6 శాతం పెరగడం, అలాగే పరిశ్రమల డిమాండ్ పెరగడం ధరలకు మద్దతునిస్తున్నాయి. టెక్నికల్‌గా చూస్తే, 1240, 1210 స్థాయిలు బలమైన సపోర్ట్‌గా ఉన్నాయి. మరోవైపు 1310 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే, ధర 1345 వరకు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక MCX Aluminium ధర ప్రస్తుతం 368 వద్ద ఉంది. సరఫరా సమస్యలు, ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న అనిశ్చిత పరిస్థితులు, అల్యూమినియం ధరలను బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రాంతం ప్రపంచ ఉత్పత్తిలో సుమారు 9 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల, అక్కడి ఉద్రిక్తతలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. టెక్నికల్‌గా 361, 354 స్థాయిలు సపోర్ట్‌గా ఉండగా, 372 పైగా నిలదొక్కుకుంటే ధర 385 వరకు పెరిగే అవకాశముంది.
ఈ ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం చైనా తీసుకున్న కీలక నిర్ణయం. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎగుమతులపై పరిమితులు విధించడం వల్ల రాగి ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ప్రపంచ సరఫరా తగ్గే అవకాశం ఉంది. దీంతో ధరలు మరింత పెరుగుతున్నాయి. అదనంగా డాలర్ బలహీనత కూడా ఈ లోహాలకు మద్దతు ఇస్తోంది. డాలర్ విలువ తగ్గినప్పుడు, విదేశీ కొనుగోలుదారులకు ఈ లోహాలు మరింత చవకగా అనిపించడం వల్ల డిమాండ్ పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
