కొందరు దుకాణదారులు సామగ్రిని అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తారు. అలాంటి సమయంలో వారు చెప్పిన ధరకే వాటిని కొనుగోలు చేయాలా, డబ్బులు నష్టపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి వస్తువుకు గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్ పీ) నిర్ణయిస్తారు. ఈ ధరను ఆ వస్తువు లేబుల్ పై అందరికీ కనిపించేలా ముద్రిస్తారు. ఆ ధరకు మించి కొనుగోలుదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొందరు దుకాణాదారులు ఎంఆర్ పీ కంటే ఎక్కువ ధరను వసూలు చేస్తారు. అదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. అలాగే చిల్లర ఇవ్వడానికి బదులు చాకెట్లు, మిఠాయిలను చేతిలో పెడతారు. చాాలామంది వినియోగదారులు ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎక్కువ ధరకు సరుకులను కొనుగోలు చేస్తున్నారు.
వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది. వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులను కూడా నియమించింది. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. దుకాణ యజమాని ఒక వస్తువును ఎంఆర్ పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చట్టానికి ఫిర్యాదు చేయవచ్చు. వడోదరకు చెందిన న్యాయవాది విరాజ్ ఠక్కర్ ఇటీవల ఈ విషయంపై మాట్లాడారు. దుకాణదారులు ఎంఆర్ పీ కంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్దమని స్పష్టం చేశారు.
దుకాణదారులు ఇలా ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించినా, వస్తువు బరువు తక్కువగా ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. అయితే రెస్టారెంట్లు, కేఫ్ లలో మాత్రం బిల్లుకు అదనంగా సర్వీస్ చార్జీని వసూలు చేస్తారు. కొన్ని నిబంధనల ప్రకారం వారికి అనుమతి ఉంటుంది. అవి తప్ప బయట మార్కెట్ లో అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్దం. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. వ్యాపారులు వస్తువుల ఎంఆర్పీ కంటే అధిక వసూలు చేయడం నేరం. అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై వినియోగదారుల కోర్టు లేదా జిల్లా వినియోగదారుల ఫోరమ్ లో ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్నితెలియజేయవచ్చు. అధికారులు ఆ ఫిర్యాదుపై వెంటనే విచారణ చేస్తారు. దుకాణదారుడు దోషిగా తేలితే జరిమానా విధిస్తారు. కొనుగోలుదారుడికి న్యాయం జరిగేలా చూస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి