నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! కారణం ఏంటి? ఆఫీస్‌లు ఉంటాయా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ), డీఆర్ పెంపు ఆలస్యం తీవ్ర అసంతృప్తిని రాజేసింది. నిర్ణీత సమయం దాటినా ప్రకటన రాకపోవడంతో, ఏప్రిల్ 16న దేశవ్యాప్త నిరసనలకు సీసీజీఈడబ్ల్యూ పిలుపునిచ్చింది. 2026 జనవరి 1 నుండి అమలులోకి రావాల్సిన పెంపును వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.

నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! కారణం ఏంటి? ఆఫీస్‌లు ఉంటాయా?
Central Government Employee

Updated on: Apr 16, 2026 | 7:00 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కరువు భత్యం (డీఏ) పెంపుపై ఆతృత రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా సకాలంలో ప్రకటించే డీఏ సవరణ ఈసారి ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నో ఏళ్లలో తొలిసారిగా ఈ ప్రకటన నిర్ణీత గడువును దాటి పోవడంతో, ఉద్యోగ సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో CCGEW (కాన్ఫెడరేషన్ అఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్) ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని క్యాబినెట్ కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రధానంగా 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే డీఏ, పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆదాయపు పన్ను, తపాలా శాఖ, వ్యవసాయ విభాగం, అలాగే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ఈ నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగుల అసంతృప్తికి ప్రధాన కారణం ఈ ఆలస్యం. 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డీఏ పెంపులు సాధారణంగా సమయానికి ప్రకటించేవి. గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా హోలీ సమయానికి ప్రకటన వస్తుందని చాలామంది భావించినప్పటికీ, ఏప్రిల్ మధ్య నాటికి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక డీఆర్ కూడా డీఏ సవరణతో ముడిపడి ఉండటంతో, ఈ ఆలస్యం పెన్షనర్లపై కూడా ప్రభావం చూపుతోంది. చివరిసారిగా అక్టోబర్ 2025లో డీఏ సవరణ ప్రకటించబడగా, అది జూలై 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే జనవరి 2026 నుంచి అమలులోకి రావాల్సిన తదుపరి పెంపు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నిరసనలు చిన్న స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు. త్వరలో ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us