మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం.. త్వరలోనే పలు కీలక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ..?
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Sell residual stake in airports : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాల్లోని మిగిలిన వాటాలను కూడా విక్రయించేందుకు సిద్ధమైనట్ల సమాచారం. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో వాటాల విక్రయంపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేటీకరించేందుకు మరో 13 విమానాశ్రయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం అసెట్ మానిటైజేషన్ ద్వారా ఈ ఏడాది రూ.2.5లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో వాటాలు ఉన్నాయి. త్వరలో పౌర విమానయాన శాఖ వీటికి సంబంధించిన పెట్టుబడుల ఉపసహరణపై అనుమతి కోరుతూ కేంద్ర మంత్రివర్గం వద్దకు ప్రతిపాదన పంపినట్లు సమాచారం.
ఇక, కొత్తగా గుర్తించిన 13 విమానాశ్రయాల్లో లాభదాయకత ఉన్నవి, లేనివి రెండిటిని కలిపి ఆకర్షణీయమైన ప్యాకేజీగా తీర్చిదిద్దే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఏయిర్‌పోర్టు అథారిటీ ఆప్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 100 ఎయిర్ పోర్టులను నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వంలో గతేడాది జరిగిన తొలివిడత ప్రైవేటైజేషన్‌లో మొత్తం ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్‌నకు అప్పగించింది. వీటిల్లో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువహాటీ ఉన్నాయి.
ఇక, ముంబయిలో విమానాశ్రయంలో 74శాతం అదానీ గ్రూప్ దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో 54శాతం జీఎంఆర్ గ్రూపునకు ఉంది. ఫ్రాపోర్టు, ఎర్మాన్ మలేసియాకు మరో 10శాతం ఉంది. హైదరాబాద్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్, తెలంగాణ ప్రభుత్వానికి.. బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా వాటాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.