10 గ్రాముల బంగారు కాయిన్ కొంటే రూ.20 వేలకు పైగానే ఆదా..! అదెక్కడో తెలుసా..?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విక్రయించే శ్రీవారి బంగారు డాలర్లు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. 10 గ్రాముల బంగారు డాలర్‌ను టీటీడీ వద్ద కొనుగోలు చేయడం ద్వారా రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. టీటీడీ 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లను అలాగే వెండి, రాగి డాలర్లను కూడా విక్రయిస్తుంది. బంగారు ధర ప్రతి బుధవారం మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది.

దేశీయ మార్కెట్ లో బంగారు ధర ఆల్ టైం రికార్డ్ కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు రూ. లక్ష ను మించింది. దీంతో కారణాలు ఏవైనా కొనుగోలుదారుడి పరిస్థితి మాత్రం పసిడి ధర వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే తిరుమల వెంకన్న క్షేత్రంలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది. తిరుపతిలోని బంగారు నగల దుకాణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయిస్తున్న శ్రీవారి డాలర్ గోల్డ్ రేట్ కు ఎంతో తేడా ఉంది.
మంగళవారం ధర 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,420 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర రూ. 92,900 లు ఉంది. ఇది కేవలం బంగారు ధర మాత్రమే. బంగారు నగలు కొంటే ఇక జీఎస్టీ మూడు శాతం, తరుగు అదనం. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్‌ను టీటీడీ వద్ద కాకుండా జ్యూవెలరీ షాపుల్లో కొనాలంటే దాదాపు రూ. 1,12,910 దాకా అవుతుందని అంచనా. మంగళవారం(ఏప్రిల్ 22) ఉన్న ధర ప్రకారం ఇందులో 10 గ్రాముల బంగారు ధర రూ 92,900 కాగా దాదాపు 18 శాతం తరుగు కింద 1.800 గ్రాముల మేర అదనంగా, 3 శాతం జీఎస్టీ ఈ రెండు కలిపి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ కోసం రూ. 1,12,910 వరకు జ్యూవెలరీ షాపు ల్లో చెల్లించక తప్పదు. అదే టీటీడీ వారి విక్రయ కేంద్రం వద్ద అయితే 10 గ్రాముల శ్రీవారి డాలర్ ను రూ 90,671 లకే లభిస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగానే ఉన్న శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో మంగళవారం టీటీడీ విక్రయిస్తున్న డాలర్ల ధరను పరిశీలిస్తే ఎంతో తేడా కనిపిస్తోంది. శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 2, 5, 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తున్న టీటీడీ వెండి, రాగి డాలర్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచింది. బులియన్ మార్కెట్ లో ఉన్న రోజువారీ ధరతో సంబంధం లేకుండా టీటీడీ భక్తులకు శ్రీహరి బంగారు డాలర్లను విక్రయిస్తోంది. బంగారు ధరను ప్రతి బుధవారం మాత్రమే నిర్ధారించి టీటీడీ ధర నిర్ణయిస్తుంది. ఈ మేరకు వారం రోజులపాటు ఒకే ధరకు డాలర్లను విక్రయిస్తోంది.
ఇందులో భాగంగానే మంగళవారం గోల్డ్ రేట్ రూ లక్ష కు టచ్ అయినా తిరుమలలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 22 వరకు టీటీడీ నిర్ణయించిన డాలర్ల ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర రూ. 90,671, 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర రూ. 46, 907, రెండు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర రూ. 19,478 గా ఉంది. జీఎస్టీ తోపాటు తరుగు అన్నీ కలిపి బంగారు డాలర్లను టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. ఈ లెక్కన తిరుమలలోని శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర రూ. 90,671 లు కాగా, అదే జ్యూవెలరీ షాప్ లో రూ 1,12,910 మేర ఉంది. అంటే దాదాపు 10 గ్రాముల శ్రీవారి డాలర్ ను టీటీడీ వద్ద కొంటే రూ. 22,239 ల వరకు కొనుగోలుదారుడి కి మిగులుతోంది. అలాగే 5, 10, 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు, 5, 10 గ్రాముల రాగి డాలర్లను కూడా టీటీడీ విక్రయిస్తుంది. అయితే గత ఆరు నెలలుగా శ్రీవారి రాగి డాలర్లు స్టాక్ లేకపోగా, 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు కూడా భక్తులకు అందుబాటులో లేకపోయింది.
వీడియో చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




