Budget 2026: ఆ రంగాలపై మోదీ సర్కార్ ఫోకస్‌.. బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ బడ్జెట్‌ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రీ-బడ్జెట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌లో తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఇప్పటికే తమతమ రాష్ట్రాలకు ఏమేం కావాలో కేంద్రానికి నివేదించారు. తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయి? తెలుగు రాష్ట్రాలు కోరిన వరాలన్నీ నెరవేరుతాయా?

Budget 2026: ఆ రంగాలపై మోదీ సర్కార్ ఫోకస్‌.. బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు..
Budget 2026

Updated on: Feb 01, 2026 | 9:01 AM

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. వికసిత్‌ భారత్‌ థీమ్‌గా బడ్జెట్‌ ఉండనుంది. బడ్జెట్‌లో ఏయే రంగాలపై ఫోకస్‌ ఉంటుంది. వేటికి పెద్దపీట వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ద్రవ్య లోటుకు కళ్లెం వేయడంతో పాటు.. క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే, రహదారులు, డిఫెన్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో మౌలిక సదుపాయల కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని సమాచారం. ఇక బడ్జెట్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఆకాంక్షలు, సామాన్యుడి ఆశలు.. వీటన్నింటి గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం.

2019 నుంచి ఒక్కో బడ్జెట్‌కు, ఒక్కో స్పెషల్‌ శారీతో కనిపిస్తున్నారు నిర్మలా సీతారామన్‌. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక విశిష్టతను తెలపడంతో పాటు, బడ్జెట్‌ ఆలోచనలకు కూడా అద్దం పట్టేలా ఉండేవి మేడమ్‌ శారీస్‌. అయితే ఈసారి నిర్మలా మేడమ్‌ ఏ శారీలో కనిపిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈసారి బడ్జెట్‌ను, చరిత్రలో తొలిసారిగా ఆదివారం ప్రవేశ పెట్టడం మరో రికార్డ్‌. దీంతో ఆదివారం నాడు స్టాక్‌ మార్కెట్‌ కూడా పని చేయనుండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

కేంద్ర బడ్జెట్‌లో మెయిన్‌గా ఏయే రంగాలపై ఫోకస్‌ ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఈసారి ఏయే రంగాలకు పెద్ద పీట వేయనున్నారు? ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూద్దాం.

ఈ సెక్టార్లపై స్పెషల్ ఫోకస్..

గ్రీన్‌ ఎనర్జీ, డిఫెన్స్‌ సెక్టార్‌, మూలధన వ్యయంపై ఫోకస్‌

10 నుంచి 15 శాతం పెరగనున్న మూలధన వ్యయం

రూ. 12 నుంచి 12.5 లక్షల కోట్లు ఉండే చాన్స్‌

దేశంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

రైల్వేలు, రహదారులు, డిఫెన్స్‌, మాన్యుఫాక్చరింగ్‌పై ఫోకస్‌

వికసిత్‌ భారత్‌ థీమ్‌గా బడ్జెట్‌

కొనుగోలు శక్తిని పెంచేందుకు ట్యాక్స్‌ మినహాయింపులు?

ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఈ బడ్జెట్‌ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రీ-బడ్జెట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌లో తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఇప్పటికే తమతమ రాష్ట్రాలకు ఏమేం కావాలో కేంద్రానికి నివేదించారు. తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయి? తెలుగు రాష్ట్రాలు కోరిన వరాలన్నీ నెరవేరుతాయా?

ముందుగా ఈ బడ్జెట్‌లో ఏపీ ఏం కోరుకుంటోందో చూద్దాం.

  • అమరావతి రాజధాని నిర్మాణం కోసం గ్రాంట్ల రూపంలో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
  • ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని విన్నపం
  • పోలవరం ప్రాజెక్టుకు వేగంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
  • పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలంటున్న ఏపీ
  • విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు స్పీడప్‌ చేయాలని విజ్ఞప్తి
  • ట్రంప్‌ దెబ్బకు కుదేలైపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని వినతి
  • విశాఖ ఎకనామిక్‌ జోన్‌ కోసం రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌

ఇక తెలంగాణ కూడా పెద్ద చిట్టానే కేంద్రం ముందు ఉంచింది. తెలంగాణ కోరికల చిట్టా ఏంటో చూద్దాం.

  • రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ. 34వేల 367 కోట్ల సాయం కోరుతున్న తెలంగాణ
  • ORR టు RRR..10 గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల కోసం రూ. 45 వేల కోట్ల ఆర్థిక సాయం
  • హైదరాబాద్‌ టు బందర్‌ పోర్టు…గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం రూ. 17వేల కోట్లు డిమాండ్‌
  • మామునూరు, పాల్వంచ, బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుల ప్రతిపాదన
  • మెట్రో రైల్‌ ఫేజ్‌-2 విస్తరణ కోసం..2 విడతలుగా రూ. 44 వేల కోట్ల నిధుల కోసం విజ్ఞప్తి
  • మూసీ ప్రాజెక్టులో భాగంగా మురుగు నీటి శుద్ధి కోసం రూ. 17 వేల కోట్లు కావాలని విన్నపం
  • వరంగల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్‌ కోసం రూ. 4వేల కోట్లు ఇవ్వాలని వినతి

ఇక కేంద్ర బడ్జెట్‌ వస్తుందంటే మెరుపులు ఏముంటాయా అని మిడిల్‌ క్లాస్‌ జనం చూస్తుంటారు. యువత, వేతనజీవులు,చిన్నవ్యాపారులు, పెన్షనర్లు తమకేంటి అని ఎదురుచూస్తుంటారు. ధరలు పెరుగుతున్న జమానాలోస్టాండర్డ్‌ డిడక్షన్‌ పెరగాలని డిమాండ్లు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

  • పాత పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50వేలు
  • కొత్త పన్ను విధానంలో రూ. 75వేలు
  • లక్ష రూపాయలకు పెంచాలని వేతనజీవుల డిమాండ్‌
  • 30 నుంచి 50 వేల రూపాయల దాకా బీమా ప్రీమియం చెల్లించేవారికి ట్యాక్స్‌ రిలీఫ్ కల్పించాలని రిక్వెస్ట్‌
  • 80-C కింద పన్ను మినహాయింపును రూ. 3లక్షలకు పెంచాలని డిమాండ్‌
  • ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత మరింత పెరగనున్న రక్షణ రంగ బడ్జెట్‌
  • 2025-26లో రక్షణరంగానికి రూ. 6.81 లక్షల కోట్లు
  • ఈసారి అది రూ. 8.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం
  • బంగారం, వెండి రేట్లు తగ్గించేందుకు GSTని తగ్గిస్తారా?

ఈసారి బడ్జెట్‌లో మేడమ్‌ ఎవరెవరికి ఎలా వడ్డిస్తారో చూడాలి. ఏయే రాష్ట్రాలకు అత్యధిక నిధులు దక్కుతాయి? ఏయే రంగాలకు పెద్ద పీట వేస్తారు అనేది పెద్ద చర్చగా మారింది.