బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. కాసుల వర్షం కురిపిస్తున్న వైట్ మెటల్..
మీరు ఇంకా బంగారం, వెండి రేట్ల గురించే చర్చిస్తున్నారా..? అయితే మీరు ఒక పెద్ద అప్‌డేట్‌ను మిస్ అవుతున్నట్టే.. ఒకప్పుడు ఇంటి సామాన్లకే పరిమితమైన అల్యూమినియం.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో నాలుగేళ్ల రికార్డులను తిరగరాస్తూ.. కిలో రూ.375 మార్కును తాకిన ఈ లోహం.. ఇన్వెస్టర్లకు బంగారు బాతులా మారింది.

అక్షయ తృతీయ అనగానే అందరి దృష్టి బంగారం, వెండి ధరల మీద ఉంటుంది. ఈ ఏడాది బంగారం ధర 10 గ్రాములకు రూ.1.54 లక్షలు దాటితే, వెండి కిలో రూ.2.50 లక్షల మార్కును తాకింది. కానీ సైలెంట్‌గా దూసుకుపోతూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న మరో లోహం ఉంది.. అదే అల్యూమినియం. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో దీని ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అల్యూమినియం మాస్ దూకుడు: ఎందుకింత డిమాండ్?
భారత మార్కెట్‌లో అల్యూమినియం ధర ప్రస్తుతం కిలోకు రూ.375కు చేరుకుంది. బంగారం లాంటి ఖరీదైన లోహాల కంటే అల్యూమినియంలో వృద్ధి శాతం ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల యారీలో బరువు తగ్గించడం కోసం అల్యూమినియం వాడకం విపరీతంగా పెరిగింది. బ్యాటరీ కేసింగ్స్ నుంచి బాడీ పార్ట్స్ వరకు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల తయారీలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తోంది. చైనా, భారత్ వంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ లోహానికి భారీ గిరాకీ ఏర్పడింది.
ధరలు పెరగడానికి అసలు చిక్కు ఎక్కడ?
డిమాండ్ ఎంత ఉన్నా, సరఫరా మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అల్యూమినియం ఉత్పత్తిని దెబ్బతీశాయి.
యుద్ధాల ప్రభావం: ఉక్రెయిన్, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్ అతలాకుతలమైంది.
విద్యుత్ ఖర్చులు: అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్తు అవసరం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో విద్యుత్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, అది నేరుగా కస్టమర్ల మీద పడుతోంది.
నిల్వలు తగ్గడం: లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ వేర్‌హౌస్‌లలో నిల్వలు క్రమంగా తగ్గుతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
పెట్టుబడిదారులకు పండగేనా?
నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది అల్యూమినియం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉండటంతో ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకోవడంతో మధ్యతరగతి ఇన్వెస్టర్లు అల్యూమినియం, రాగి వంటి లోహాలపై దృష్టి సారిస్తున్నారు.
