Investment plans: మంచి పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నారా..? వీటిని ఒక్కసారి పరిశీలించాల్సిందే..!
జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కష్టబడి పనిచేయడం, వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం, మిగిలిన సొమ్మును వివిధ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం జరగుతూ ఉండాలి. దీని వల్ల కొంత కాలానికి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. అయితే డబ్బులను వేటిలో ఇన్వెస్ట్ చేయాలనే దానిపై అనేక సందేహాలు తలెత్తుతాయి.

సాధారణంగా బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలలో ఎక్కువ మంది పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లపై కూడా ఆసక్తి పెరిగింది. అలాగే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడింటిలో ఏది మంచిదో, ఏది ఎక్కువ ఆదాయం ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు)
వివిధ బ్యాంకులు, బ్యాంకేతర సంస్థలు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిర్ణీత కాలానికి అసలుతో సహా వడ్డీని అందుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా వడ్డీ అందిస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం కోరుకునే వారికి చాలా బాగుంటాయి. దాదాపు రిస్కు లేని, ఆర్థిక భద్రత కలిగిన పథకాలు అని చెప్పవచ్చు. అయితే అత్యధిక రాబడి సంపాదించాలనుకునే వారికి సరిపోదు.
మ్యూచువల్ ఫండ్స్
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు పెరుగుతున్నారు. ఇవి పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి ఈక్విటీలు, డెట్, హైబ్రిడ్ సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాస్ (సీఐపీ) ద్వారా ప్రతి నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా వీలుగా ఉంటాయి. ఈ ఫండ్స్ మేనేజర్లుగా అనుభవం కలిగిన వ్యక్తులు ఉంటారు. అనేక విధాలుగా ఆలోచించి మంచి స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేస్తారు. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి కోరుకునేవారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. అయితే ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి.
ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్)
పెట్టుబడిదారుల నుంచి సొమ్ములను సేకరించి, వాటితో బాండ్లు, షేర్లు, డెరివేటివ్ లు కొనుగోలు, విక్రయ లావాదేవీలు నిర్వహించే వాటినే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అంటారు. స్టాక్ మార్కెట్ పై అవగాహన లేనివారు, కొత్త ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులు పెడతారు. ఇవి కూడా షేర్ల మాదిరిగానే స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటాయి. సాధారణ షేర్ల మాదిరిగానే వీటిని కొనడం, అమ్మడం చేయవచ్చు. తక్కువ ఖర్చు, సులభంగా ట్రాక్ చేయడం, క్రయవిక్రయాలు జరగడం తదితర కారణాలతో చాలామంది వీటిని ఇష్టపడతారు. అయితే వీటిలో పెట్టుబడి పెట్టేవారికి డీమ్యాట్ ఖాతాతో పాటు మార్కెట్ పై కొంత అవగాహన అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








